కల్యాణం.. కమనీయం | kalyanam kamaneeyam | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం

Published Sat, Feb 25 2017 12:15 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

కల్యాణం.. కమనీయం - Sakshi

కల్యాణం.. కమనీయం

- పాగాలంకరణతో వరుడైన మల్లన్న
 
శ్రీశైలం(శ్రీశైలం): మహాశివరాత్రి పర్వదినాన పాగాలంకరణతో వరుడైన ముక్కంటి కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది. సాయంత్రం 6 గంటలకు అశేష భక్తజనం మధ్య నిర్వహించిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ప్రభోత్సవం కనుల పండువగా సాగింది. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మల్లన్న పాగాలంకరణ ఘట్టాన్ని చూసి తరించేందుకు వచ్చిన వేలాది మంది భక్తజనంతో శ్రీశైలాలయం పోటెత్తింది. జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునుడికి రాత్రి 10గంటల తర్వాత లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకం పంచామృతాలతో జల, క్షీర, ఫలరసాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దీనికి ముందు రాత్రి 7.30 గంటలకు జగద్గురు పీఠాధిపతి డాక్టర్‌ చెన్నసిద్ధారామ శివాచార్యా స్వామీజీ తన శిష్య బృందంతో లింగోద్భవ కాలానికి ముందు జరిగే అభిషేకాన్ని నిర్వహించారు. కాగా మల్లన్న వరుడయ్యే సమయం ప్రారంభం కావడంతో రోజుకో మూర చొప్పున నియమ నిష్టలతో పాగాను నేసిన పృ«థ్వీ వెంకటేశ్వర్లు ఒంటిపై నూలుపోగు లేకుండా గర్భాలయ కలశ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ చేసే పాగాలంకరణ ఘట్టాన్ని ఆరంభించారు.
 
రాత్రి 10.30 గంటల నుంచి ప్రారంభమైన పాగాలంకరణోత్సవంతో మల్లన్న వరుడిగా మారి భ్రమరాంబతో కళ్యాణోత్సవానికి సిద్ధమయ్యాడు. పాగాలంకరణ సాగుతున్నంత సేపు ఆలయ ప్రాంగణంలోని అన్ని విద్యుత్‌ దీపాలను ఆర్పేశారు. ఈ సందర్భంగా భక్తులు తన్మయత్వం చెందుతూ ఓం నమః శివాయ అంటూ పంచాక్షరీ నామ భజన చేశారు. ఘట్టం పూర్తవుతుండగానే ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన పెళ్లి వేదిక స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవానికి కనుల పండువగా పుష్పాలంకరణతో సిద్ధమయింది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల కల్యాణోత్సవ ఘడియలు రాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యాయి. మహా శివరాత్రి రోజున కల్యాణోత్సవానికి ముక్కోటి దేవతలు వస్తారని.. మహా విష్ణువు కన్యాదానం.. బ్రహ్మ రుత్వికత్వం నిర్వహిస్తాడని శైవాగమం చెబుతోంది. శివమాలధారణ.. ఉపవాస దీక్షలు.. పవిత్ర పాతాళగంగలో పుణ్య స్నానాలు.. పాగాలంకరణ సహిత స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవంతో దీక్ష ముగిసిందని, తమ తనువులు పులకించాయంటూ శివస్వాములు మాల విరమణ చేసుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు.
 
నందివాహనాధీశా.. నమో నమః
శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు నందివాహనంపై దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రదక్షిణ చేసి తిరిగి నందివాహన సమేతులైన స్వామి వార్ల ఉత్సవమూర్తులను యథాస్థానానికి చేర్చారు. వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement