రావణ వాహనంపై శ్రీశైలేశుడు
శ్రీశైలం: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లు రావణవాహనాన్ని అధిష్టించగా, శ్రీభ్రమరాంబాదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాల్లో మూడవ రోజున అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీభ్రమరాంబాదేవిని చంద్రఘంట రూపంలో, స్వామిఅమ్మవార్లను రావణవాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి ప్రధానాలయ రాజగోపురం నుంచి రథశాల వద్దకు చేర్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, అంకాలమ్మగుడి, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు వెళ్లి రాత్రి తిరిగి ఆలయ ప్రవేశం చే సింది. వందలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్ల అలంకార మూర్తులను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు.