తూలుతున్న గుడుంబా ప్రియులు
పెద్దపల్లి: పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ఏకమై గుడుంబాతోపాటు బెల్ట్‌షాపులపై ఉక్కుపాదం మోపినా..మళ్లీ అక్కడక్కడా గుడుంబా ప్రియులు తూలి పడుతున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. రెండు నెలలుగా విరామం తీసుకున్న గుడుంబా వ్యాపారులు, బెల్ట్‌షాపు నిర్వాహకులు తిరిగి తమ వ్యాపారాలను పునః ప్రారంభించినట్లు రూడీ అవుతున్నాయి. పెద్దపల్లి పట్టణంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో స్థానిక పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించి పెద్ద సంఖ్యలో అమ్మకందారులను బైండోవర్ చేశారు. అయితే దందా ఆగిపోయిందని అందరూ భావిస్తుండగా అక్కడక్కడా గుడుంబా సేవిస్తున్న వారు దర్శనమిస్తూనే ఉన్నారు.
పట్టణంలో కనీసం పది ఇళ్లలో గుడుంబా వ్యాపారం మళ్లీ మొదలైందని భావిస్తున్నారు. ఇదే వ్యాపారంలో ఏళ్ల తరబడి జీవించిన వారు తిరిగి తమ వ్యాపారాన్ని వదులుకోలేక గుడుంబా విక్రయాలను పునః ప్రారంభించారు. గ్రామాల్లో సైతం గుడుంబాతోపాటు బెల్ట్‌షాపులు ఒకటి, రెండు చాటుమాటుగా విక్రయాలు సాగిస్తున్నాయని సమాచారం. పోలీసులు మరోసారి దృష్టి సారిస్తేగాని గుడుంబా అమ్మకాలు నిలిచిపోయే అవకాశం లేకపోలేదు.