లోటు బడ్జెట్లో రాష్ట్రం
లోటు బడ్జెట్లో రాష్ట్రం
Published Fri, Oct 21 2016 1:00 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
మంత్రి నారాయణ
నెల్లూరు(మినీబైపాస్): రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని, రాష్ట్రాభివృద్ధి ఒక్క రోజులో సాధ్యం కాదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. 13వ ఆర్థిక సంఘ నిధులు రూ.49 లక్షలతో 20వ డివిజన్ పరిధిలోని పావనీ టవర్స్ నుంచి సీపీఆర్ కల్యాణ మండపం దగ్గర ఉన్న కల్వర్టు వరకు సీసీ డిస్పోజల్ డ్రెయిన్ అభివృద్ధి పనులను మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. పదేళ్లలో నెల్లూరును స్మార్టు సిటీగా మారుస్తామని చెప్పారు. డ్రైనేజీ, విద్యుత్, నీరు, చెత్త, రోడ్డు, వీధి దీపాల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. రోడ్డు వెడల్పులో భాగంగా ఆక్రమణలను తొలగిస్తున్నామని, దీన్ని ప్రతిపక్ష నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరుకు ఎల్‌ఈడీ లైట్లు, స్వర్ణాల చెరువును పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని సీఎం ప్రాజెక్టును తయారు చేశారని చెప్పారు. అనంతరం శిద్దా రాఘవరావు మాట్లాడారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని చెప్పారు. లోటు ఉన్నా పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తుందని వివరించారు. మేయర్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, కార్పొరేటర్ నూనె మల్లికార్జునయాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement