రాష్ట్రమే ఒక స్టార్టప్ కంపెనీ: చంద్రబాబు
- రాష్ర్టంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయ్
- జాబ్స్ డైలాగ్ ఉద్యోగరథం ప్రారంభం
- ఎనిమిది నెలల్లో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్
విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఓ స్టార్టప్ కంపెనీ అని, అసమగ్రంగా జరిగిన విభజన తర్వాత రాష్ర్టంలో పెట్టుబడులకు వినూత్న అవకాశాల కల్పనకు ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రానున్న రోజుల్లో దేశంలోనే ఉపాధి అవకాశాల కల్పనలో రాష్ర్టం ముందువరుసలో ఉంటుందని అభివర్ణించారు. గురువారం నగరంలోని సిద్ధార్థ కళాపీఠంలో టీఎంఐ గ్రూప్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్స్‌డైలాగ్ ఉద్యోగరథాన్ని సీఎం ప్రారంభించారు. ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటు ద్వారా రూ. 149కే ప్రతి ఇంటికీ 100 చానళ్ల కేబుల్ టీవీ, 50 ఎంబీపీస్ ఇంటర్నెట్, వీడియోకాల్‌ను అందించేందుకు ఏర్పాటుచేస్తోందని చెప్పారు.
పొంతన లేని సమాధానం
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉపాధి అవకాశాలకు తగిన ఆలోచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమానికి హాజరైనవారిని కోరారు. ఓ వ్యక్తి నిలబడి నిరుద్యోగులకు నైపుణ్యంలో శిక్షణతోపాటు ఈఎస్‌ఐ, హెల్త్ కార్డ్‌లు ఏర్పాటు చేస్తే నిరుద్యోగులు ఆసక్తి చూపుతారని చెప్పారు. తమ ప్రభుత్వం మెరుగైన ఆలోచనలతోనే ముందుకుపోతోందని చంద్రబాబు పొంతన లేని సమాధానమిచ్చారు.
విద్యుత్ షార్ట్ సర్య్కూట్
మరో రెండు నిమిషాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమానికి వస్తారనగా వేదిక వద్ద విద్యుత్ షార్ట్ సర్య్కూట్ జరిగింది. పోలీస్ సిబ్బంది వైర్లు తప్పించబోతుండగా స్వల్పంగా మంటలంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. హాల్లో ఏర్పాటుచేసిన ఏసీలు పనిచేయకపోవడంతో కార్యక్రమానికి హాజరైనవారంతా ఉక్కపోతకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లు పాల్గొన్నారు.