రెగ్యులర్ ప్రాతిపదికన వైద్య పోస్టుల భర్తీకి ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ జారీచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాంట్రాక్ట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌ఎస్ ప్రశాంత్ డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయడాన్ని నిరసిస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్‌లో రిలేనిరాహార దీక్షలు సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ తాము నాలుగైదేళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైద్యులుగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ప్రతి మూడేళ్లకోసారి రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీచేస్తుందన్నారు. ఈ దఫా జనవరిలో అందుకు భిన్నంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసిందన్నారు. రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న తమను ప్రభుత్వ నిర్ణయం నిరాశపరిచిందన్నారు. అలా చేయడం వల్ల ఉద్యోగ భద్రత లేకుండా పోతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 400మంది వైద్యులు పనిచేస్తుండగా ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా మరో 500 కాంట్రాక్ట్ వైద్యులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తాము శాశ్వతంగా కాంట్రాక్ట్ వైద్యులుగానే మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు.
వైద్యుల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించినప్పటికీ ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య, ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించి రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ఆదుకోవాలని కోరారు.
ప్రభుత్వం దిగివచ్చేవరకు తాము నిరసన కొనసాగిస్తామన్నారు. నిరసన దీక్షలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి, ఉపాధ్యక్షుడు డాక్టర్ కె.సురేష్‌కుమార్, కోశాధికారి డాక్టర్ సృజన్, 13 జిల్లాల కాంట్రాక్ట్ వైద్యులు పాల్గొన్నారు.