Published
Wed, Aug 3 2016 11:23 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
మాట్లాడుతున్న పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ
ఖమ్మం సిటీ : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ మహిళలపై ఫారెస్టు, పోలీసుల మూకుమ్మడి దాడులు నిలిపివేయాలని, వారిపై బనాయించిన కేసులను ఎత్తివేయాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఙాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో హరితహారం పేరుతో పోడు భూముల్లో వేసిన పంటలను ధ్వంసం చేయిస్తూ గిరిజన మహిళలపై దాడులు జరపడం సరైందికాదన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రెండు రోజులు పర్యటించి పంట ధ్వంసాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఇల్లెందు మండలం మిట్టపల్లి, పోలారం, మాణిక్యారం, రొంపేడు, కోటిలింగాల, టేకులపల్లి మండలంలోని అబ్బుగూడెం తదితర గ్రామాల్లో వేలాది రూపాయలతో వేసిన పంటలను దుర్మార్గంగా ధ్వంసం చేశారని అరోపించారు. ఇదేమని ప్రశ్నించిన పోలారం సర్పంచ్ వాంక్‌డోత్ సరోజినిపై ఫారెస్టు అధికారులు, పోలీసులు దాడిచేసి స్పృహతప్పి పడిపోయేలా ప్రవర్తించారని అవేదన వ్యక్తం చేశారు. మిట్టపల్లిలో గిరిజన మహిళలపై బీట్ ఆఫీసర్ జయరామ్ చేయిచేసుకున్నారని పేర్కొన్నారు. గిరిజన మహిళలపై దాడులు నిలిపివేయాలని, వారిపై అక్రమంగా బనాయించిన కేసులను ప్రభుత్వం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.రమ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ, నాయకులు పద్మ, లలిత, శిరోమణి, ఝాన్సీ, సావిత్రి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.