ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ఆపివేయాలి
నెల్లూరు(పొగతోట):
ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ఆపివేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు పార్థసారథి, ఎల్లంకి వెంకటేశ్వర్లు, మాదాల వెంకటేశ్వర్లు, మూలం రమేష్ డిమాండ్ చేశారు. బెజ్జంగి ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ శనివారం నగరంలో ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు ఐదు రోజులగా విశాఖ మాన్యం, ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్‌లో ఎన్‌కౌంటర్ పేరుతో నిరంతరం జరుగుతున్న హత్యలు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. బాక్సైట్‌పై కన్నేసిన బహుళజాతి కంపెనీలు దళారీ పాలకులతో ఒప్పందం చేసుకుని దేశ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలపైకి సాయుధ బలగాలను దింపి అరచాకం చేస్తున్నారని తెలిపారు. గ్రీన్‌హంట్ పేరుతో ప్రజలపై యుద్ధం ప్రకటించి ప్రజలు జీవించే హక్కు కాలరాస్తున్నారన్నారు. ఈ నెల 24వ తేదీ 33 మందిని కాల్చిచంపరన్నారు. ఎన్‌కౌంటర్ పేరుతో ప్రభుత్వం పోలీసులతో హత్యలు చేయిస్తోందన్నారు. అటవీ ప్రాంతాల నుంచి సాయుధబలగాలను వెనక్కు రప్పించాలన్నారు. అనంతరం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరుతూ కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు.