స్కూలు బస్సే మృత్యు శకటం
మచిలీపట్నం (కోనేరుసెంటర్): ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కింద నలిగి ఒక బాలుడు ప్రాణాలు వదిలాడు. బందరు మండలం గోకవరం గ్రామంలో ఒక ప్రైవేటు కార్పొరేట్ స్కూలు బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వస్తోంది. ఉదయం 9 గంటల సమయంలో నందమూరుకు చెందిన ఆర్‌ంఎంపీ వైద్యుడు కుమారుడు (12) యథావిధిగా బస్సెక్కాడు. బాబూ జాగ్రత్త అని తల్లి పలు జాగ్రత్తలు చెప్పి బస్సు ఎక్కించింది. బస్సు వేగంగా మచిలీపట్నంలోని స్కూలు వైపు వెళుతుండగా మెట్లపై నిలబడిన సదరు విద్యార్థి ప్రమాదవశాత్తు జారి కిందికి పడిపోగా బస్సు వెనుక చక్రాలు అతని మీదుగా వెళ్ళిపోయాయి. చక్రాల కింద నలిగిపోవటంతో అక్కడికక్కడే చనిపోయాడు.
దుర్ఘటనను ప్రత్యక్షంగా చూసిన గ్రామస్తులు పలువురు బస్సును అడ్డగించి డ్రైవర్‌ను కిందికిలాగిపడేశారు. తల్లిదండ్రులు వచ్చే వరకు కదలనిచ్చేదిలేదంటూ అటకాయించారు. ఘోరం తెలుసుకున్న బాలుని తల్లిదండ్రులు పరుగుపరుగున వచ్చారు. విగతజీవిగా మారిన కొడుకును చూసి కన్నీరుమున్నీరయ్యారు.
అదే బస్సులో ఇంటికి మృతదేహం తరలింపు
చదువుతో పాటు ఆటపాటల్లో చురుగ్గా ఉండే ఆ విద్యార్ధి నూరేళ్ళ జీవితం అర్ధాంతరంగా ఆగిపోవటంలో సదరు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్థులు భగ్గుమన్నారు. కనీస జాగ్రత్తలు పాటించడం లేదని అన్నారు. కాగా బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. స్కూలు యాజమాన్యం బెదిరింపులతో కేసు వద్దనుకున్నట్లు తెలిసింది. చివరకు అదే బస్సులో బాలుని శవాన్ని ఇంటికి తరలించారు. రూరల్ ఎస్సై మధుతో సాక్షి మాట్లాడగా సంఘటన జరిగిన మాట వాస్తవమేనని, అయితే ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఏం చేయలేకపోయామని అన్నారు.