విద్యార్థి సంపూర్ణ వికాసమే కీలకం | student total improvement importent | Sakshi
Sakshi News home page

విద్యార్థి సంపూర్ణ వికాసమే కీలకం

Published Wed, Aug 24 2016 10:20 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

ప్రధానోపా«ధ్యాయురాలికి ప్రశంసాపత్రం అందిస్తున్న కలెక్టర్‌

ప్రధానోపా«ధ్యాయురాలికి ప్రశంసాపత్రం అందిస్తున్న కలెక్టర్‌

  •  గణితంపై భయాన్ని తొలగించాలి
  •  పదోతరగతిలో మెరుగైన ప్రమాణాలు సాధించాలి
  •  మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవాలి
  •  ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌
  • ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంపూర్ణ వికాసాభివృద్ధే కీలకంగా ప్రధానోపాధ్యాయులు ముందుకెళ్లాలని కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ కోరారు. పదో తరగతి ఫలితాలు, పాఠశాలల్లో మౌలిక వసతులు తదితరాంశాలపై జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నగరంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిని జెడ్పీ చైర్‌పర్సన్‌ కవిత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. పాఠశాలల్లో తప్పనిసరిగా టాయిలెట్స్‌ ఉండాలన్నారు. అసంపూర్తిగా ఉన్నవాటిని పూర్తిచేయాలన్నారు. మరో 870 పాఠశాలల్లో టాయిలెట్స్‌ను ఎన్‌ఆర్‌ఐఈజీఎస్‌ ద్వారా నిర్మించుకోవాలన్నారు. పాఠశాల పరిశుభ్రత కోసం విద్యాకమిటీ చైర్మన్‌తో సమన్వయం చేసుకుని వర్కర్లను నియమించుకోవాలని సూచించారు. పాఠశాలలన్నీ పచ్చగా ఉండేలా చెట్లు పెంచాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రతి పాఠశాలకు తాగునీరు, రన్నింగ్‌వాటర్‌ కోసం మిషన్‌ భగీరథ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను వెంటనే కూల్చివేసేందుకు జిల్లాపరిషత్‌ నుంచి త్వరలో అనుమతుల వస్తాయన్నారు. జిల్లాలో జీరో ఎన్‌రోల్‌మెంట్‌ పాఠశాలలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ‘‘ప్రభుత్వ పాఠశాలలంటే.. వాటిలో ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులే చదువుతారనే పేరుంది. దీనిని తొలగించేందుకు ప్రధానోపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముంది’’ అని అన్నారు. గత సంవత్సరం పదోతరగతి పరీక్షల్లో అత్యధికమంది విద్యార్థులు గణితంలోనే ఫెయిలవుతుండడంపై విచారం వ్యక్తం చేశారు. దీనిని అధిగమించేందుకు, గణితంపై భయం తొలగేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. మాతృభాష తెలుగులో కూడా కొందరు ఫెయిలువుతుండడం బాధాకరమన్నారు. పదోతరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకుగాను కనీసంగా 10 నుంచి 20 మోడల్‌ ప్రశ్నాపత్రాలతో ప్రాక్టీస్‌ చేయించాలని సూచించారు.
    జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత మాట్లాడుతూ... సిలబస్‌ పూర్తిపై కాకుండా, బోధించిన అంశం విద్యార్థులకు ఏమేరకు అర్థమవుతోందన్న దానిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. గణతం ప్రాథమికాంశాలను నేర్పించకపోతే పై తరగతులకు వెళ్లినప్పుడు ఇబ్బంది పడతారని అన్నారు. డీఈఓ నాంపల్లి రాజేష్, డిప్యూటీ డీఈఓలు బస్వారావు, వెంకటనర్సమ్మ, రాములు కూడా మాట్లాడారు. పదోతరగతిలో నూటికి నూరుశాతం ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఆర్‌వీఎం పీఓ రవికుమార్, డీడీ అబ్రహం, డీసీఈబీ చైర్మన్‌ కనపర్తి వెంకటేశ్వర్లు, ఆర్‌పీహెచ్‌ఎం జిల్లా అధికారి నిర్మల్‌కుమార్, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement