నివాళులు అర్పిస్తున్న మంత్రి
-
మంత్రి జోగు రామన్న
-
బేలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
బేల : ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులందరికీ చదువే ఆయుధమని, దీన్ని గుర్తించి ప్రతి పిల్లవాడిని తల్లిదండ్రులు చదివించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కొమురం భీం చౌరస్తా, స్థానిక బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాని ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో గిరిజనుల అక్షరాస్యత చాలా తక్కువగా ఉందని తెలిపారు. గిరిజన సంఘాలు ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో పిల్లలందరూ బడికి వెళ్లి చదువుకునేలా చైతన్యం చేయాలని అన్నారు.
ఈ నెలాఖరు వరకు ఎస్టీ, ఎస్సీ, బీసీ రుణాలు మంజూరైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ జమయ్యేలా చూస్తానని తెలిపారు. ఈ నెల 17నుంచి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి ఐటీడీఏ ఉట్నూర్ నుంచి ఒక ప్రత్యేక అధికారి ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నైతం బాలు మాట్లాడుతూ 1/70, పీసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు స్థానిక అంతర్రాష్ట్ర రోడ్డు గుండా ర్యాలీ నిర్వహించారు. కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మస్కే తేజ్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు నాక్లే రాందాస్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రావుత్ మనోహార్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నిపుంగే సంజయ్, ఎంపీటీసీ సభ్యుడు కొడప అరుణ్, మండల కో–ఆప్షన్ సభ్యుడు తన్వీర్ ఖాన్, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యదర్శి టాక్రే గంభీర్, మండల అధ్యక్షుడు ఓల్లఫ్‌వార్ దేవన్న, ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ కార్యదర్శి పెందుర్ రాందాస్, తదితరులు పాల్గొన్నారు.