♦ చేపల పెంపకంలోనూతన ఒరవడి
♦ విజయవంతమైన ప్రయోగాత్మక యూనిట్
♦ మత్స్యకారులకు చేతినిండా పని, నికర ఆదాయం
♦ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన పాలేరు
కుంటలు, చెరువులు, రిజర్వాయర్లలో చేపలు పోయడం.. పెంచడం.. పట్టడం కష్టతరమే. లక్షలాది చేప పిల్లలను నీటిలో వదిలితే.. పెరిగాక చేతికొచ్చేది అంతంతమాత్రమే. పొద్దస్తమానం కష్టించి నీటిలో వేట సాగించినా గిట్టుబాటు కాని పరిస్థితి. వీటన్నింటినీ అధిగమించేందుకు.. మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కేజ్ కల్చర్(నీటిలో ఒకేచోట వలల్లోనే చేపలు పెంచటం) పద్ధతిని చేపట్టింది. పాలేరు రిజర్వాయర్‌లో తొలిసారి చేపట్టిన ఈ పద్ధతి సత్ఫలితాలు ఇస్తోంది. ఆదాయం లభించడంతోపాటు నూతన ఒరవడితో మత్స్యకారులు ముందుకు సాగుతున్నారు.
కూసుమంచి : జిల్లాలోని పాలేరు రిజర్వాయర్‌ను గత ఏడాది జూలై నెలలో కేజ్ కల్చర్ పద్ధతిలో చేపల పెంపకానికి ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. దీంతోపాటు మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌సాగర్, నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్, శ్రీరాంసాగర్, కరీంనగర్ జిల్లా దిగువ మానేరు, ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుల్లో కేజ్ కల్చర్ ద్వారా చేపల పెంపకం చేపట్టారు. జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో పాలేరు రిజర్వాయర్‌లో చేపట్టిన ఈ పద్ధతి విజయవంతమైంది.
జార్ఖండ్ స్ఫూర్తితో..
రిజర్వాయర్‌లో చేపలు పెంచటం ఒక పద్ధతి అయితే.. చేపలను ప్రత్యేకంగా తయారు చేసిన పంజర వలల్లో పెంచటం మరో పద్ధతి. ఈ వలల్లో చేపలను పెంచే పద్ధతి ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఇదే పద్ధతిన రాష్ట్రంలో కూడా చే పలు పెంచాలని సీఎం కేసీఆర్ భావించిన మీదట.. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి జార్ఖండ్‌లో పర్యటించి.. కే జ్ కల్చర్‌పై పరిశీలన చేశారు. ఇందులో శాస్త్రీయత ఉండటం, అధిక ఆదాయం పొందటంతో ఈ పద్ధతిని రాష్ట్రంలో కూడా ప్రయోగాత్మకంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు చేపట్టడంతో సత్ఫలితాలు వస్తున్నాయి.
కేజ్ కల్చర్ అంటే..
కేజ్ కల్చర్(పంజర వలల్లో చేపలు పెంచటం) అంటే రిజర్వాయర్‌లో ఒకేచోట చేపలను ఉంచి.. వాటికి తగిన ఫీడింగ్ ఇస్తూ పెంచటం. నీటిలోనే ప్లాస్టిక్ డబ్బాలతో అరలను తయారు చేసి.. వీటిలో 12 అడుగుల లోతులో పంజరం లాంటి వలలను వదులుతారు. వీటిలో చేప పిల్లలను విడుస్తారు. వాటికి ఆహారం వేస్తుంటారు. ఈ విధానం ద్వారా ఒక్కో అరలో సుమారు 5వేల చేప పిల్లలను పెంచుతారు. 50 గ్రాముల బరువు పిల్లలు పెరగగానే వాటిని తీసి ఖాళీ అరల్లో వదిలి ఫీడింగ్ ఇస్తూ.. 8 నెలల వరకు పెంచుతారు. ఈ చేపలు కేజీ వరకు పెరిగితే ఒక్క యూనిట్‌లో సుమారు 25 నుంచి 30 టన్నుల చేపలు ఒకేచోట లభ్యమవుతాయి.
పాలేరు ప్రథమం..
కాగా.. పాలేరు రిజర్వాయర్‌లో కేజ్ కల్చర్ పద్ధతిలో చేపట్టిన చేపల పెంపకం సత్ఫలితాలు ఇస్తోంది. రాష్ట్రంలోని ఇతర యూనిట్ల కంటే ఇక్కడ పెంచిన చేపలు మంచి దిగుబడి ఇచ్చాయి. దీంతో ఈ యూనిట్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది. పాలేరు రిజర్వాయర్ నీరు స్వచ్ఛమైనవి కావడంతోపాటు తగిన లవణాల లభ్యత ఉండటంతో ఈ యూనిట్ విజయవంతమవుతోంది. కాగా.. పాలేరులో ఏర్పాటు చేసిన యూనిట్ కోసం 13 మంది మత్స్యకారులు జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. వీరి ఆధ్వర్యంలోనే కేజ్ కల్చర్ యూనిట్ నిర్వహిస్తున్నారు. వీరే టెండర్ వేసి.. కేజ్ చేపలను విక్రయిస్తున్నారు.