నాగాయలంక వద్ద ఇండియన్ సాల్మన్ (మాగ) చేపలు సాగు చేస్తున్న కేజ్‌లు
సాక్షి, అమరావతి: ఇండియన్ సాల్మన్.. మన వాడుక భాషలో ‘మాగ’గా పిలిచే ఈ చేపలను దేశంలో తొలిసారి మన రాష్ట్రంలో సాగుచేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణాజిల్లా నాగాయలంక వద్ద కేజ్ కల్చర్‌లో చేపట్టిన ఈ చేపల సాగు విజయవంతమైంది. దీంతో చెరువుల్లో సాగుచేసే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. సముద్రచేపల్లో అత్యంత రుచికరమైన వాటిలో ఇదొకటి.
జంతుశాస్త్రపరంగా సాల్మో సాలార్‌గా పిలిచే ఈ చేప మన దేశానికి చెందినది కాదు. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లో పెరిగే ‘సాల్మో నిడ్స్’ సమూహానికి చెందినది. 5 నుంచి 10 అడుగుల లోతులో చల్లటి ఉప్పునీటి జలాల్లో మాత్రమే ఇవి పెరుగుతాయి. ఇవి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సముద్రపునీరు, మంచినీరు కలిసే చోటుకువచ్చి గుడ్లు పెట్టి పొదిగి తిరిగి సముద్ర జలాల్లోకి వెళ్లిపోతాయి.
ఇవి 10 కిలోల వరకు పెరుగుతాయి. పొడవుగా, నునుపాటి శరీరంతో ఉండే ఈ చేపకు పైభాగానే చిన్న నల్లటి చుక్కలుంటాయి. కింద భాగం (పొట్ట) తెల్లగా ఉంటుంది. మలేషియా, కువైట్‌లలో మాత్రమే వీటిని సాగుచేస్తున్నారు. ఈ చేపల తొలి హేచరి మలేషియాలో ఉంది. సముద్ర జలాల్లో సహజసిద్ధంగా దొరకడమే తప్ప.. వీటిసాగుపై ఇన్నాళ్లు దృష్టి పెట్టలేదు.
పోషకాలు పుష్కలం..
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఈ చేపల్లో విటమిన్స్, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, సెలీనియం, అయోడిన్‌కు కొదవలేదు. వారానికి కనీసం రెండుసార్లు తిన్నవారిలో గుండెపోటు, క్యాన్సర్, ట్యూమర్స్ దరిచేరవు. బీపీ తగ్గడమే కాదు.. ఎముకలు బలపడతాయి. నాడీవ్యవస్థ, మెదడు పనితీరు మెరుగుపడడమేగాక జ్ఞాపకశక్తి పెరుగుతుందని, వయసు సంబంధిత నష్టం తగ్గిస్తాయని అధ్యయనాల్లో రుజువైంది.
మన దేశంలో మత్స్యకారులకు ఈ చేపలు అరుదుగా దొరుకుతాయి. మార్కెట్‌కు ‘మాగ’ చేప వస్తే చాలు.. ఎంత రేటైనా ఎగరేసుకుపోతారు. వెన్నుముల్లు మాత్రమే ఉండే ఈ చేపను వేపుడు చేసుకునేందుకు ఎక్కువమంది ఇష్టపడతారు. ఇగురు, పులుసు కూడా వండుకుంటారు. రొయ్యలకు ప్రత్యామ్నాయంగా రైతులు ఈ చేపలసాగుపై దృష్టి సారిస్తున్నారు.
పెట్టుబడికి రెట్టింపు ఆదాయం
దేశంలో తొలిసారి కృష్ణాజిల్లా నాగాయలంక వద్ద సముద్ర జలాల్లో ప్రయోగాత్మకంగా కేజ్ కల్చర్ విధానంలో వీటిసాగు చేపట్టారు. కేజ్ కల్చర్‌లో విజయవంతం కావడంతో చెరువుల్లో సాగుపై దృష్టిసారించారు. కేజ్‌ల్లో అరకిలోకు మించి పెరగవు. అదే నాలుగడుగుల లోతున్న చెరువుల్లో 8–12 నెలలు పెంచితే కిలో నుంచి రెండుకిలోల వరకు పెరుగుతాయి. సీ మౌత్‌లో దొరికే సీడ్‌ను నర్సరీ చెరువులో మూడంగుళాల సైజు వరకు పెంచి తర్వాత ఎకరా చెరువులో రెండువేల పిల్లల వరకు వేయవచ్చు.
45 శాతం ప్రొటీన్లు, 12 శాతం కొవ్వు పదార్థాలు కలిగిన మేత వేస్తే చాలు. వ్యాధి నిరోధకశక్తి అధికం కాబట్టి వ్యాధులకు కూడా దూరంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ధర కిలో రూ.450కి పైగా పలుకుతోంది. కిలోకి రూ.225 వరకు పెట్టుబడి అవుతుంది. రెట్టింపు ఆదాయం వస్తుంది. ఈ చేపల సాగుపై లోతైన అధ్యయనం చేసి రైతులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
తొమ్మిదేళ్లు శోధించా
కొన్నేళ్లుగా కేజ్‌కల్చర్‌లో పండుగప్ప సాగుచేస్తున్నా. ఇండియన్ సాల్మన్ సాగుచేయాలని తొమ్మిదేళ్ల నుంచి ఎంతో లోతుగా అధ్యయనం చేసి ఇటీవలే ప్రయోగాత్మకంగా చేపట్టా. సీ మౌత్‌లో పిల్లలను సేకరించి వేశా. పోషక విలువలున్న మేత అందిస్తున్నా.
నాలుగు నెలల్లో పావుకిలో సైజు పెరిగాయి. మరో మూడునెలలు పెంచితే ముప్పావు కిలోవరకు వస్తాయి. రూ.లక్షన్నర వరకు పెట్టుబడి అవుతుంది. రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నా. చెరువుల్లో సాగుకు ఎంతో అనుకూలమైన ఈ చేపల సాగుపై రైతులు దృష్టిసారిస్తే మంచిది.
– తలశిల రఘుశేఖర్, నాగాయలంక, కృష్ణాజిల్లా
Comments
Please login to add a commentAdd a comment