మహిళకు స్ఫూర్తి.. సంధ్య.
Published Tue, Mar 7 2017 11:50 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
కాకినాడ :
ఓ మారుమూల కుగ్రామంలో పదో తరగతి పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం విశాఖ వెళ్ళిన ఆమెకు బయటి ప్రాంతాలకు వెళ్ళి చదవడంలో అమ్మాయిలు ఎదుర్కొనే ఇబ్బందులను స్వయంగా అనుభవమైంది. పురుషులతో సమానంగా మహిళలకు ఉన్నత చదువులు చదవాలన్న ఆమె ఆకాంక్ష మహిళల కోసం ప్రత్యేక కళాశాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు బీజం పడింది. అలా ఓ చిన్న కళాశాల నుంచి ప్రారంభమై ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, బీఎడ్, డీఎడ్, ఎమ్‌బీఏ, ఎమ్‌సీఏ సహా ఎన్నో మహిళా కళాశాలలు ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు. ఆమే కాకినాడ కేంద్రంగా నడుస్తున్న వీఎస్‌లక్ష్మి కరస్పాండెంట్ సంధ్య. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని కోడూరు గ్రామంలో పదో తరగతి వరకు చదివిన ఆమె ఇంటర్, డిగ్రీలను క్రమ శిక్షణకు మారుపేరైన విశాఖ భారతీయ విద్యాకేంద్రంలో పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ (ఫిజిక్స్) పూర్తిచేసిన ఆమె 1990లో వివాహమయ్యాక కాకినాడలో స్థిరపడ్డారు. విద్యపట్ల ఉన్న మక్కువ, మనోస్థైర్యం గమనించిన ఆమె మామ డాక్టర్ వీవీ కృష్ణంరాజు ప్రోత్సాహంతో 1998లో వీఎస్‌లక్ష్మీ మహిళా విద్యాసంస్థల ఏర్పాటుకు తోడ్పాటునందించారు. అలా ప్రారంభమైన మహిళా కళాశాల ప్రస్థానం అంచెలంచెలుగా గడిచిన 19 ఏళ్ళలో ఎంతోమంది అమ్మాయిలను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. కేవలం మహిళల కోసమే ఏర్పాటైన ఈ విద్యాసంస్థ అమ్మాయిల అభిరుచులకు అనుగుణంగా ఇంటర్, డిగ్రీలతోపాటు వారివారి అభిరుచులకు అనుగుణంగా నచ్చిన కోర్సులో చేరేందుకు వీలుగా ఎన్నో అనుబంధ కోర్సులకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ చదివిన ఎంతో మంది అమ్మాయిలు ఇప్పుడు దేశ, విదేశాల్లో రీసెర్చ్ ఫ్రొఫెసర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు.దాదాపు 17 వేల మందికి పైగా మహిళలు సంధ్య పర్యవేక్షణలోని కళాశాలలో చదివి ఇప్పుడు పదిమందికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Advertisement
Advertisement