success women
-
వయసు 60, డీల్ చేసే వ్యాపారాలు 100, అట్లుంటది హైదరాబాదీ అంటే!
Kalaari Capital founder Vani Kola: భారతదేశంలో బిజినెస్ చేస్తూ గొప్ప సక్సెస్ సాధించిన అతి తక్కువ మందిలో 'వాణి కోలా' (Vani Kola) ఒకరు. అమెరికాలో చదివి, అక్కడే అనే సంవత్సరాలు విజయవంతమైన కెరీర్ ప్రారంభించి, ఆ తరువాత ఇండియా వచ్చి ఇప్పుడు 100 వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్న 'వాణి కోలా' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్‌లో జన్మించిన వాణి 16 సంవత్సరాల వయస్సులో పోస్ట్-సెకండరీ విద్య, ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింది. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదవడానికి 1980 చివరలో అమెరికా వెళ్ళింది. యునైటెడ్ స్టేట్స్‌లోని అరిజోనా స్టేట్ యూనివర్శిటీ మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. నిజానికి వాణి కోలా సిలికాన్ వ్యాలీలో 22 ఏళ్ల విజయవంతమైన కెరీర్ తర్వాత వెంచర్ క్యాపిటల్ సంస్థను ప్రారంభించేందుకు 2006లో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత 'వెంచర్ కాపిటల్'లో వివిధ కంపెనీల భాగస్వామ్యంతో 'కలారి కాపిటల్' అనే సంస్థను స్థాపించింది. (ఇదీ చదవండి: యాపిల్ కంపెనీ కొత్త ఉత్పత్తులు - విజన్ ప్రో, మాక్‌బుక్, ఐఓఎస్ 17 ఇంకా..) కలారి కాపిటల్ 2012లో 150 కోట్ల డాలర్ల పెట్టుబడితో ప్రారంభమైంది. అయితే ఆ తరువాత వాణి అధ్యక్షతన కేవలం నాలుగు సంవత్సరాల్లోనే.. అంటే 2017 నాటికి సంస్థ ఆదాయం 650 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ కామర్స్, మొబైల్ సర్వీసులు, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిలో పెట్టుబడులకు నాయకత్వం వహించింది. ఆ తరువాత డ్రీమ్11, ర్బన్ లాడర్‌తో సహా అనేక వ్యాపారాలలో పెట్టుబడి పెట్టింది. (ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. ఎలా అంటే?) వీటితో పాటు ఎంప్రోస్ అండ్ కంట్రోల్ డేటా కార్పొరేషన్ వంటి సంస్థలతో సాంకేతిక రంగంలో పనిచేయడం ప్రారంభించింది. ఈ రంగంలో సుమారు 12 సంవత్సరాల తరువాత రైట్వర్క్స్ను స్థాపించింది. నాలుగు సంవత్సరాలు సెర్టస్ సాఫ్ట్వేర్ సీఈఓగా కూడా ఉన్నారు. వాణి కోలా కేవలం వ్యాపారవేత్తగ మాత్రమే కాకుండా, ఆసక్తిగల పాఠకురాలు కూడా. ఈ కారణంగానే ఆమె ఆలోచనలను వ్రాయడం & పంచుకోవడం వంటివి చేసేదని చెబుతారు. -
చదివింది బీటెక్.. చేసేది బట్టల వ్యాపారం.. రూ. కోట్లలో టర్నోవర్
AKS Co-Founder and CEO Nidhi Yadav: జీవితంలో ఎదగాలంటే నిరంతర కృషి, పట్టుదల అవసరం. చదివిన ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. పది మందికి ఉద్యోగం కల్పించే పని ఏదైనా చేయవచ్చు. ఇలా ఆలోచించే వారి సంఖ్య గతంలో తక్కువగా ఉన్నా.. ప్రస్తుతం పెరుగుతూనే ఉంది. ఈ కోవకు చెందినవారిలో ఒకరు 'నిధి యాదవ్' (Nidhi Yadav). ఇంతకీ నిధి యాదవ్ ఎవరు? ఆమె చేస్తున్న బిజినెస్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. కరణ్ సింగ్ యాదవ్ & రాజ్‌బాల యాదవ్‌లకు జన్మించిన నిధి యాదవ్ 2004లో ఇండోర్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసింది. ఆ తరువాత ఇండోర్‌లోని జిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత కంప్యూటర్ ఇంజనీర్ ఉద్యోగానికి డెలాయిట్‌లో జాయిన్ అయ్యింది. అయితే ఆమెకు ఉద్యోగం చేయడం ఏ మాత్రం ఇష్టం లేదు. కాబట్టి సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో ఫ్లోరెన్స్‌లోని పోలిమోడా ఫ్యాషన్ స్కూల్లో ఒక సంవత్సరం కోర్సును పూర్తి చేసింది. ఇది పూర్తయిన తరువాత ఇటలీలో ఉద్యోగం వచ్చినా కుటుంబానికి దూరంగా ఉండలేక అది కూడా వద్దనుకుంది. సొంత కంపెనీ ప్రారంభం.. ఆ తరువాత 2014లో రూ. 3.5 లక్షల పెట్టుబడితో AKS పేరుతో కంపెనీ ప్రారంభించింది. ఇందులో సరసమైన ధరలకే అద్భుతమైన దుస్తులను 18 నుంచి 35 సంవత్సరాల వయసున్న వారికి విక్రయించడం ప్రారభించింది. కంపెనీ స్థాపించడానికి కొంత సమయం పట్టినప్పటికీ కేవలం ఐదు సంవత్సరాల్లో టర్నోవర్ రూ. 100 కోట్లు (2019-2020 ఆర్థిక సంవత్సరం) దాటింది. (ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!) నిజానికి ఆమె కంపెనీ ప్రారంభించాలనే ఆలోచనను తన కుటుంబంతో చెప్పినప్పుడు ఒక్క సారిగా ఆశ్చర్యపోయినప్పటికీ తరువాత మద్దతుగా నిలిచారు. కంపెనీ ప్రారంభించాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడవుతున్న దాదాపు అన్ని బ్రాండ్స్ గురించి ఏకంగా ఆరు నెలలు పరిశోధన చేసింది. సంస్థ మొదలైన మొదటి సంవత్సరమే ఆమె రూ. 1.60 కోట్లు సంపాదించింది. ఆ తరువాత ఏడాదికి అది రూ. 8.50 కోట్లకు చేరింది. 2018 నాటికి కంపెనీ ఆదాయం ఏకంగా 48 కోట్లకు చేరడం విశేషం. (ఇదీ చదవండి: రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!) నిధి యాదవ్ AKS కంపెనీ ప్రధాన కార్యాలయం గుర్గావ్లో ఉంది. 2021 చివరినాటికి సంస్థ ఆదాయం రూ. 200 కోట్లకు చేరినట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. కరోనా సమయంలో కంపెనీ కొన్ని సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, అలాగే అవకాశాలు కూడా ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగానే మాస్క్‌లు, పిపిఈ కిట్ల తయారీని మొదలుపెట్టారు. ఆ తరువాత పిల్లలకు కూడా దుస్తులు తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు. 2023-2024 నాటికి కంపెనీ టర్నోవర్ రూ. 500 కోట్లకు పెంచాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. -
ఆకాశమే హద్దుగా...
అవకాశం లభించాలేగానీ ఆకాశమే మాకు హద్దు అంటున్నారు భారత మహిళామణులు... అవనీ చతుర్వేది, భావనా కాంత్, మోహనా సింగ్. దేశంలోనే మొదటి మహిళా సూపర్సోనిక్ జెట్ ఫైటర్లుగా చరిత్ర సృష్టించబోతున్నారు. ప్రస్తుతం భారత వాయు సేనలో శిక్షణ పొందుతున్న వీరు మరో నెల రోజుల్లో యుద్ధ విమానాలను నడపబోతున్నారు. యుద్ధ విమానాల్లో మొదటిసారి...! ఈ మహిళా త్రయం తేలికపాటి యుద్ధ విమానాలైన పిలాటస్ పీసీ-7, కిరణ్, హాక్ జెట్లను నడిపేందుకు శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం అవని, భావన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, అత్యధిక టేకాఫ్ వేగం కలిగిన మిగ్-21 యుద్ధ విమానాలను నడిపేందుకు సిద్ధమవుతున్నారు. అవని 2 సీట్ల సామర్థ్యం కలిగిన మిగ్-21 రకం విమానాన్నినడిపేందుకు సూరత్‌ఘర్ ఎయిర్‌బేస్‌లో శిక్షణ పొందుతోంది. భావన కూడా అంబాల ఎయిర్‌బేస్‌లో శిక్షణకు సిద్ధమవుతోంది. ఇక మోహన హాక్ జెట్‌ను నడిపేందుకు కలైకుండ ఎయిర్‌బేస్‌లో శిక్షణ పూర్తయిన తర్వాత ఆపరేషనల్ స్క్వాడ్‌గా వెళ్లబోతుందని సీనియర్ అధికారి తెలిపారు. కఠినమైన శిక్షణలో నెగ్గితేనే...! జెట్ ఫైటర్‌గా రాణించాలంటే కఠినమైన శిక్షణ పూర్తిచేయాల్సి ఉంటుంది. సుమారు పన్నెండుసార్లు ద్వంద్వ తనిఖీలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదట విమానం ఎగరటంలో మెళకువలు, నిర్వహణ పద్ధతులు, టేకాఫ్, లాండింగ్ వంటి ప్రాథమిక అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. యుద్ధ విమానం నడిపే సమయంలో ఏర్పడే చిక్కుల్ని ఎదుర్కొనే సమయస్ఫూర్తి, సామర్థ్యం, నేర్పు ఉండాలి. ప్రాథమిక శిక్షణ అనంతరం యుద్ధ సమయంలో పాటించాల్సిన వ్యూహాలతో పాటు, యుక్తులు ప్రదర్శించగలగాలి. అవసరాన్ని బట్టి ఆకాశం నుంచి ఆకాశంలోకి, ఆకాశం నుంచి భూమిపైకి విమాన మార్గాన్నిమళ్లించే చతురత కలిగి ఉండాలి. ఈ శిక్షణలో నెగ్గితేనే యుద్ధ విమానాన్ని నడిపేందుకు అర్హత సాధిస్తారు. ఈ దశలన్నీ దాటుకుని సుమారు ఏడాదిన్నరగా జరుగుతున్న శిక్షణ పూర్తి చేసుకుని మొదటి మహిళా పైలట్ ఫైటర్లుగా మారనున్న అవని, భావన, మోహనలకు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం. - సుష్మారెడ్డి యాళ్ళ -
ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే బ్యాచ్.. ఒకే బెంచ్
తండ్రి తను డాక్టర్ కావాలని కలలు కన్నాడు. ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. అయితే ముగ్గురు కుమార్తెలు ఒకేసారి డాక్టర్లు అయి ఆయన కలల్ని నెరవేర్చారు! ఇదొక అపూర్వమైన సందర్భం. కర్ణాటక, బళ్లారి నగరంలోని శ్రీరాంపురం కాలనీకి సమీపంలో.. విశ్వనాథపురం కాలనీలో నివాసం ఉంటున్న శంకర్.. స్థానిక ఆస్పత్రిలో నర్సింగ్ ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు శ్వేత, స్వాతి, శ్రుతి అని ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. 2017లో ‘నీట్’లో ఈ ముగ్గురికీ ఒకేసారి ఎంబీబీఎస్ సీటు రావడం మాత్రమే కాదు, ముగ్గురూ బళ్లారిలోని ‘విమ్స్’ (విజయనగర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సీటు సంపాదించారు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. 2014లో పీయూసీ పూర్తి చేసిన శ్వేత అప్పట్లో అనారోగ్య కారణాలతో ఎంబీబీఎస్ సీటు సంపాదించుకోలేక పోయింది. రెండవ అమ్మాయి స్వాతి 2015లో పీయూసీ పూర్తి చేసి ఏఐపీఎంటీ (ఆలిండియా ప్రీ మెడికల్ టెస్ట్) పరీక్షలు రాసి ఎంబీబీఎస్‌కు ప్రయత్నించింది. అయితే ఆ ఏడాది ఇద్దరికీ సీటు రాలేదు. మూడవ కుమార్తె శ్రుతి 2017లో పీయూసీ పూర్తి చేయడంతో ఈసారి ముగ్గురూ కలిసి బెంగళూరులో 2016–17 విద్యాసంవత్సరంలో జాతీయ స్థాయి ‘నీట్’ పరీక్షలు రాశారు. నీట్లో శ్వేత 1216, స్వాతి 1413, శ్రుతి 750వ ర్యాంకులను సాధించడంతో బళ్లారి విమ్స్‌లో ఎంబీబీఎస్ చదివేందుకు ముగ్గురికీ ఒకేసారి సీటు లభించింది. సాధారణంగా టెన్త్‌లో లేదా పీయూసీలో.. అక్కాచెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు ఒకే తరగతి గదిలో కూర్చొని చదువుకోవడం చూస్తుంటాం. అయితే ప్రతిష్టాత్మకమైన ఎంబీబీఎస్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒకే బ్యాచ్‌లో సీటు లభించడంతో పాటు ఒకే కాలేజీ, ఒకే బెంచ్‌లో కూర్చునే అవకాశం లభించడం నిజంగా విశేషమే. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిలు ముగ్గురూ ఒకేసారి ఎంబీబీఎస్‌లో సీటు దక్కించుకోవడం మరొక విశేషం. శ్వేత, స్వాతి, శ్రుతి రోజూ ఉదయం ఇంటి నుంచి క్యారియర్ కట్టించుకుని కాలేజీకి వెళుతుంటే.. చూడముచ్చటగా ఉంటుందని చుట్టపక్కల వాళ్లు, బంధువులు అంటున్నారు. – జి.నరసనగౌడ్, స్టాఫ్ రిపోర్టర్, బళ్లారి -
సం'చలనం'
ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ స్ట్రిక్ట్‌గా పనిచేస్తే వ్యవస్థలో చలనం వస్తుందో లేదో తెలియదు కానీ ఆమె పదవిలో చలనం వచ్చే అవకాశం ఎక్కువ. సంచలనం కోసం కాకుండా సత్యం కోసం యుద్ధం చేస్తే మంచి చలనం ఉంటుంది. సంచలనం. షి ఈజ్ యాన్ ఆఫీసర్ ఫర్ గుడ్ ఛేంజ్. 2017, కేరళలోని అలప్పుళ జిల్లా. మార్తండమ్ చెరువును పరిశీలిస్తున్నారు కలెక్టర్. ఓ కట్టడం కోసం ఆ చెరువు సగం లెవెల్ చేసి ఉంది. నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. ఆ చెరువును ఆనుకునే ఇంకోవైపు వరిపొలాలున్నాయి. వాటిలో సగం కూడా లెవెల్ చేసి ఉన్నాయి. ‘ఇక్కడేం కడ్తున్నారు?’ అడిగారు సబార్డినేట్స్‌ను. ‘పార్కింగ్ లాట్ మేమ్’ చెప్పారు. ‘ఊ’ అంటూ దీర్ఘంగా నిట్టూర్చారు కలెక్టర్ వెనక్కి తిరుగుతూ. ఆమె కారులో కూర్చొని అక్కడి నుంచి కదిలాక చెప్పడం మొదలుపెట్టాడు సంబంధింత సబార్డినేట్. ‘మేమ్.. ఇందులో మంత్రిగారి హస్తముంది. ప్రతిపక్షాల నుంచి చాలా కంప్లయింట్స్ వచ్చినా మేనేజ్ చేసుకున్నారు. పైగా నిరూపిస్తే మినిస్టర్గిరే కాదు ఎమ్మేల్యేగిరీకీ రాజీనామా చేస్తాను అని సవాల్ కూడా చేశారు’ చెప్పాడు. ఆ చెరువు కబ్జా ఫైల్‌లోనే తల పెట్టిన కలెక్టర్ పేజీ తిప్పుతూ ‘ఈ కట్టడం లేనప్పటి చెరువు ఫొటోలు ఏమైనా మనకు దొరకొచ్చా?’ అడిగారు.‘ప్రయత్నించొచ్చు మేమ్’ తెలిపాడు. ‘అయితే ప్రయత్నం మొదలుపెట్టండి’ ఫైల్ మూసేస్తూ చెప్పారు కలెక్టర్. ఆ ప్రయత్నం ఫలించింది. చెరువుకు చెందిన శాటిలైట్ ఫొటోలు వచ్చాయి. అంతుకుముందు చెరువు ఎలా ఉందో ప్రస్తుతం ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తోంది వాటి ద్వారా. వాటిని పెట్టి పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి సమర్పించారు కలెక్టర్. దీని మీద సంబంధిత వ్యక్తి కోర్టుకు కూడా వెళ్లాడు. అతని పిటీషన్‌ను కొట్టిపారేసింది కోర్టు. కేరళ ప్రభుత్వ ‘ప్యాడీ అండ్ వెట్‌ల్యాండ్ యాక్ట్’ కింద నేరం రుజవైంది. అతను చెప్పినట్టు రాజీనామా చేయలేదు. కాని ఆ జిల్లా కలెక్టర్ ధైర్యసాహసాలు, నిబద్ధత దేశమంతా మారుమోగాయి. ఆమె.. టీవీ అనుపమ. అతను.. కేరళ రవాణాశాఖ మంత్రి థామస్ చాందీ! అనుపమ ఈ యాక్షన్‌తో కేరళ కేబినేట్ వణికిపోయింది. ఆమెను అలప్పుళ జిల్లా కలెక్టర్‌గా ఏరికోరి నియమించింది స్వయానా ముఖ్యమంత్రి పినరయి విజయన్నే అయినా నియమనిబంధనలను అతిక్రమిస్తే మంత్రిని కూడా ఉపేక్షించేది లేదని నిరూపించారు ఆమె. స్వప్నం సాకారమైన వేళ కేరళలోని మలప్పురం జిల్లా ‘పొన్నని ’అనుపమ సొంతూరు. తండ్రి కేకే సుబ్రహ్మణ్యన్. సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తూ 2002లో మరణించాడు. తల్లి టీవీ రమణి ఎండోమెంట్ శాఖ ఉద్యోగి. అనుపమే పెద్ద కూతురు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకే. నైన్త్క్లాస్లోనే నిర్ణయించుకుంది ఐఏఎస్ కావాలని. తండ్రి చనిపోయేనాటికి అనుపమ టెన్త్‌లో ఉంది. నాన్న పోయిన పుట్టెడు దుఃఖాన్ని కడుపులో దాచుకొని పబ్లిక్ పరీక్షలు రాసింది. స్టేట్‌లో పదమూడవ ర్యాంక్ సంపాదించింది. ఇంటర్లో మూడో ర్యాంక్! బిట్స్ పిలానీ గోవా క్యాంపస్‌లో బీటెక్ చేసింది. ఓవైపు ఇంజనీరింగ్ చదువుతూనే సివిల్స్‌కి ప్రిపేరవసాగింది. ఫస్ట్ అటెంప్ట్‌లోనే (2010) ఆల్ ఇండియా నాల్గవ ర్యాంక్‌తో సివిల్స్‌లో విజయం పొందింది. ఆహారం భద్రం 2015లో ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌గా చార్జ్ తీసుకున్నారు అనుపమ. ఏ పనిచేసినా అందులోని లొసుగుల్ని సవరించందే నిద్రపోరు. వృత్తి అంటే అంత అంకితభావం. ఐఏఎస్‌గా నియామకం పొందిన క్షణాన్నే ప్రమాణం చేశారు కర్తవ్యనిర్వహణే ప్రాణం అని. ఆ నైజాన్నే ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌గా ఉన్నప్పుడూ చూపించారు. పేరున్న చాలా ఫుడ్ బ్రాండ్స్ కల్తీలు, మితిమీరిన శాతంలో క్రిమిసంహారక మందులను వాడి ఆహారపదార్థాలను మార్కెట్లో అమ్ముతున్నాయి. ఈ విషయం ఆమె దృష్టికి వచ్చింది. శాంపిల్స్ తెప్పించారు. పరీక్షకు పంపించారు. నిజమని తేలింది. ప్రతి వస్తువు కల్తీనే. పరిమితికి మించి 300 శాతం పెస్టిసైడ్స్. హతాశురాలయ్యారు. వెంటనే గోడౌన్స్ మీద దాడులు చేశారు. కేస్ కోర్ట్‌దాకా వెళ్లింది. రుజువులుగా కూరగాయలు, పండ్ల శాంపిల్స్‌ను కోర్టు ముందుంచారు. పెద్ద పెద్ద బ్రాండ్ల మోసాలను కోర్టు ప్రత్యక్ష్యంగా తెలుసుకుంది. డీలర్ల అరెస్ట్‌కు ఆర్డర్ వేసింది. అనుపమ తీసుకున్న స్టెప్ ఇంతటితో ఆగలేదు. పౌరులకు ఒక విజ్ఞాపన చేశారు. ఎవరిళ్లల్లో (వాకిలి, డాబా, బాల్కనీ ఇలా) వాళ్లు, చేలల్లో, చెలకల్లో సేంద్రీయ పద్ధతుల్లో కూరగాయలు పండించమనీ, విత్తనాలను తాము అందిస్తామని. అప్పటిదాకా కల్తీ నిండిన కడుపులను ప్రక్షాళన చేయడానికి ఇది మంచి ఆఫర్ అని కేరళ రాష్ట్రప్రజలూ ఒకొక్కరే నెమ్మదిగా ఇళ్లల్లో ఎంత జాగా ఉంటే అంతలో కూరగాయల పంట వేసుకోవడం మొదలుపెట్టారు. ప్రజల స్పందన రాష్ట్రప్రభుత్వాన్నీ ఆలోచనలో పడేసింది. వాళ్లకు ఏదైనా సహాయం అందించాలనుకుంది. దాంతో ఉచితంగా డ్రిప్‌ఇరిగేషన్, బయోగ్యాస్ ప్లాంట్ సౌకర్యాలను కల్పించింది. సబ్సిడీలు అందించింది. ఇది ఎంత ప్రభావం చూపిందంటే అప్పటిదాకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి చేసుకుంటున్న కూరగాయల దిగుమతులను గణనీయంగా తగ్గించుకునేంతగా. దటీజ్ అనుపమ ఐఏఎస్! ‘ఇదంతా నా ఘనతగా మీడియా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాలు, ఆర్భాటాలు నాకిష్టం ఉండదు. పైగా ఇందులో నేను చేసిందీ ఏమీ లేదు. కల్తీ జరుగుతోందని, పెస్టిసైడ్స్ వాడకం ప్రాణాంతకంగా మారిందని ప్రజలకు తెలిసింది. సొంతంగా సేంద్రీయ వ్యాపారం చేసుకుంటే ప్రభుత్వ పరంగా నేను ఈ సహాయం చేయగలనని చెప్పాను. ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రభుత్వమూ ముందుకు వచ్చింది. కొనసాగుతోంది. అంతే’ అంటూ సింపుల్‌గా సెలవిస్తారు ఆమె. వచ్చిన కొత్తలోనే... సంచలనం కోసం కాదు సత్యం కోసం పోరాడాలి అనేది అనుపమ తత్వం. అన్యాయాన్ని మనం సహించకపోతే న్యాయం తానంతట తానే బతుకుంది అనేది ఆమె నమ్మిన నిజం. అందుకే వ్యక్తిగత జీవితంలోనూ పాటిస్తారు నిక్కచ్చిగా. 2014లో జరిగిన ఓ సంఘటనే ఇందుకు ఉదాహరణ. కుటుంబంతో కలిసి ఇంకో ఇంట్లోకి మారాల్సి వచ్చింది ఆమె. ఇచ్చిన గడువులో సామాన్లను తీసుకోలేకపోయారు అనుపమ. దాంతో కేవలం ఆమెను వేధించే ఉద్దేశంతోనే ‘నొక్కుకూలీ’ (సామాన్లను కాపాలా కాసినందుకు, ప్రైవేట్ లేబర్‌తో ఆ సామాన్లను లోడ్ లేదా అన్లోడ్ చేయించినందుకు యూనియ్హెడ్లోడ్ వర్కర్స్కు అదనంగా చెల్లించే డబ్బు)ఇవ్వాలని సీఐటీయూ కన్వీనర్ బి.మురళి డిమాండ్ చేశారు.ఇది అన్యాయమని వాదించారు అనుపమ. వాషింగ్‌మెషీన్‌ను అలాగే ఉంచేసుకొని అదనపు కూలీ ఇస్తేనే దాన్ని ఇస్తామని చెప్పి వాళ్లింటి ముందున్న గోడమీద తన ఫోన్ నంబర్ రాసి డబ్బులు ఎప్పుడిస్తారో ఆ నంబర్‌కి కాల్ చేయమని చెప్పి మరీ వెళ్లాడు మురళి. అక్కడితో ఆగకుండా ఆ కుటుంబాన్ని వేధించడం మొదలుపెట్టాడు. పోలీస్కంప్లయింట్ ఇచ్చి మురళిని అరెస్ట్ చేయించారు అనుపమ. పక్షం రోజులు రిమాండ్‌లో ఉన్నాడు మురళి. తనను నియమించిన చీఫ్మినిస్టర్కైనా .. మురళి లాంటి వాళ్లకైనా.. తానెవరికీ భయపడననీ నిరూపించారామె. దటీజ్ అనుపమ. అందుకే ఆమె ప్రమేయం లేకుండానే ఆమె ఓ సంచలనం అయింది. నచ్చకపోయినా ఆమె పని తీరు ప్రాచుర్యం పొందుతోంది. ఇలాంటప్పుడే అనిపిస్తుంది పబ్లిసిటీ మంచిదే... ఇతరులకు ఇన్స్పైరింగ్గా! – శరాది -
మరణం మనసు మార్చుకుంది!
(సక్సెస్ స్టోరీ) బతకాలనే సంకల్పం.. క్యాన్సర్‌ను కూడా జయించేలా చేస్తే, చనిపోతామేమోనన్న భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుందట. అంతేకదా మరీ.. మనసులో సంకల్పం గట్టిగా ఉండాలేగానీ సాధించలేనిది ఏదైనా ఉంటుందా? కష్టాలకు ఎదురీది, ప్రాణాంతక వ్యాధులను జయించి, తిరుగులేని విజయాలు సాధించినవారు చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. అలాంటివారిలో ఆనందశంకర్ జయంత్ కూడా ఒకరు. క్యాన్సర్ వ్యాధి సోకినప్పటికీ తలవంచక బతికితీరుతానన్న ధైర్యంతో ఆ మహమ్మారినే లొంగదీసుకుంది. ఇలా చెప్పేకంటే.... ఆమె కళను చూసి ముచ్చటపడి మరణమే మనసు మార్చుకుందనడం సబబేమో! ఓ ఆర్టిస్టుగా.. ఓ ఇల్లాలిగా.. ఓ అధికారిగా.. అన్నింటికీ మించి ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించిన వీరనారిగా ఆనంద శంకర్ జయంత్ ఎందరికో స్ఫూర్తి. ఆమె విజయగాథ ఇది.. చెన్నైలోని తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1961లో ఆనందశంకర్ జయంత్ జన్మించారు. తల్లి ప్రోత్సాహంతో నాలుగేళ్ల వయసులోనే తొలిసారి కాలికి గజ్జె కట్టారు. చెన్నైలోని కళాక్షేత్రంలో ఆరేళ్లపాటు శిక్షణ పొందారు. భరతనాట్యంతోపాటు కర్నాటక సంగీతం, వీణ, కొరియోగ్రఫీ నేర్చుకున్నారు. తర్వాత పసుమర్తి రామలింగశాస్త్రి దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత కొందరు విద్యార్థులకు భరతనాట్యం నేర్పుతూనే చదువుపై దృష్టి సారించారు. కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఆర్ట్స్, హిస్టరీ, కల్చర్‌లోనూ మాస్టర్స్ డిగ్రీలను పూర్తిచేశారు. తొలి మహిళా రైల్వేఆఫీసర్గా.. పీజీ చదువుతున్న రోజుల్లోనే యూపీఎస్సీ పరీక్షలపై ఆసక్తి కలిగింది. అప్పటికే ఆనంద యూనివర్సిటీ టాపర్. ఆ పట్టుదలతోనే యూపీఎస్సీ పరీక్షల్లో పాసై సౌత్ సెంట్రల్ రైల్వేలో తొలి మహిళా ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. మరి ఇటు డాన్స్ అటు ఉద్యోగం ఎలా సమన్వయం చేసుకోవాలి? పైగా జాబ్ రైల్వేలో! నాట్యానికి ఉద్యోగం అడ్డంకి కాదని గ్యారెంటీ ఏంటి? రైళ్ల తనిఖీలు, ప్రమాద ప్రాంతాలను సందర్శించడం, కంట్రోల్ రూమ్ డ్యూటీ. ఒక్కసారిగా ప్రపంచం మారిపోయింది. అమ్మకు మాత్రం మాటిచ్చారు. ప్రాణం పోయినా డ్యాన్స్ వదలనని. ఆ మాటైతే ఇచ్చారుగానీ ప్రాక్టికల్ గా సాధ్యం కాలేదు. డాన్సు, ఉద్యోగం కావాలంటే ఫ్యామిలీతో గడపడానికి టైం దొరికేది కాదు. ఇలా అయితే లాభం లేదని డాన్స్ ఉద్యోగం– కుటుంబం– ఈ మూడింటినీ షెడ్యూల్ చేసుకున్నారు. ప్రాక్టీస్ కోసం మూడు గంటలు. వీకెండ్లో మాత్రమే డాన్స్ పెర్ఫామెన్స్. సమాజంలోని లింగ భేదాన్ని ప్రశ్నించేలా ఆమె రూపొందించిన వాట్ అబౌట్ మీ అనే నృత్యరూపకం ఎందరినో ఆలోచింపజేసింది. కళారంగంలో ఆమె చేస్తున్న కృషికి ఎన్నో అవార్డులు వరించాయి. 2007లో పద్మశ్రీతో సత్కరించింది భారత ప్రభుత్వం. ఊహించని షాక్ అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో ఊహించని కుదుపు. ముప్పై ఏళ్ల నాట్యశిఖరం ఒక్కసారిగా కూలిపోతుందా అనిపించింది. 2008లో అమెరికా వెళ్లేముందు రోజు రొమ్ములో ఏదో గడ్డలాగా అనిపిస్తే ఎందుకైనా మంచిదని మెమోగ్రామ్ టెస్టు చేశారు. రిపోర్టు రాకముందే ఆవిడ అమెరికా వెళ్లారు. రెండు వారాల తర్వాత ఇండియాకు వస్తున్న ఆనందకోసం భర్త ఎయిర్ పోర్టుకి వచ్చారు. ఆమెను చూడగానే గట్టిగా హత్తుకొన్నారు. ఆరోగ్యం జాగ్రత్త అని మాత్రమే అన్నారు. కేన్సర్ అని చెప్పడానికి అతనికి ధైర్యం సరిపోలేదు. కానీ ఆనంద ఊహించగలిగారు. ఆమె స్థానంలో మరొకరైతే పూర్తిగా కుంగిపోయేవారేమో. కానీ ఆమె ఆత్మస్థైర్యం ఏమాత్రం సడలలేదు. ఎందుకంటే ఆమె ముందుగానే మానసికంగా సిద్ధమయ్యారు.‘‘ఎలాగూ తప్పించుకోలేనని తెలిసింది. అందుకే మూడు విషయాలు నాకు నేను చెప్పుకొన్నాను. ఒకటి– క్యాన్సర్ నా జీవితంలో ఒక పేజీ మాత్రమే అదే మొత్తం పుస్తకం కాదు. రెండు... నేను క్యాన్సర్ ను జయిస్తాను తప్ప.. అది నన్ను కబళిస్తుందని కుంగిపోను. మూడు... నాకే ఇలా ఎందుకు అని ఎప్పటికీ అనుకోను’’ అంటూ తన గుండె నిబ్బరాన్ని చాటుకున్నారు ఆనంద. ఆ పాదం ఆగలేదు.. కీమోథెరపీ, రేడియాలజీ కారణంగా శరీరం మెత్తబడి నడవడానికే కష్టమవుతుందని డాక్టర్లన్నారు. డ్యాన్స్ ను కొంతకాలం పక్కనపెట్టక తప్పదని సూచించారు. కానీ ఆనంద వాళ్ల మాటలు పట్టించుకోలేదు. డాన్స్ కోసం ఎందాకైనా వెళ్లాలనుకున్నారు. ప్రాణం ఆగినా ఫరవాలేదు కానీ ప్రాణం ఆగొద్దనుకున్నారు.డ్యాన్స్ చేయకుండా నేను ఉండలేను అని కరాఖండిగా చెప్పేశారు ఆనంద. 2009, జులై 7న శస్త్రచికిత్స. ఆరోజు హాస్పిటల్‌కు వెళ్తున్నట్టు కాకుండా.. ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తున్నట్లే భావించారు. పార్లర్‌కు వెళ్లి మానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకున్నారు. ఆపరేషన్ థియేటర్‌ను ఆడిటోరియం ప్రాంగణంగా మనసులో అనుకున్నారు. సర్జరీ ముగిసింది. ఆపరేషన్ కాస్ట్యూమ్స్‌తో కాకుండా వెంట తెచ్చుకున్న డ్రెస్ వేసుకొని, నుదుటన బొట్టు, లిప్ స్టిక్ పెట్టుకున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే – పెర్ఫామెన్స్ ఎలా ఉంది డాక్టర్ అని అడిగారు. అప్పుడు డాక్టర్లు ఆమె ఆత్మస్థైర్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. సంగీత కళామతల్లికి నిత్యాభిషేకం సర్జరీ జరిగిన రెండురోజుల్లోనే కాలికి గజ్జె కట్టారు. ఈవెంట్లు ఆర్గనైజ్ చేయడం, పిల్లలకు నేర్పడం– పెర్ఫామెన్స్ కు సిద్ధమవడం ఇలా ఎప్పటిలాగే రోజువారీ కార్యక్రమాల్లో మునిగి పోయారు. ఆనంద దృష్టిలో క్యాన్సర్ అనేది జీవన్మరణ సమస్య కాదు. అదొక ఓ సాధారణ వ్యాధి. అదే విషయాన్ని ఆమె చెప్పాలనుకున్నారు. క్యాన్సర్ పై ఆనంద చేసిన టెడ్ (టెక్నాలజీ, ఎంటర్ టైన్ మెంట్, డిజైన్) టాక్ అత్యుత్తమ ప్రసంగంగా నిలవడం గమనార్హం. ఆ స్పీచ్ విన్న తర్వాత అందరూ ఆమెను కేన్సర్ బాధితురాలిగా కాకుండా.. ఓ మహమ్మారిని జయించిన వీరనారిగా గుర్తించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఒక ఆనంద సాధారణ జీవితం గడుపుతున్నారు. రైల్వే అధికారిగా ఉద్యోగం చేస్తూనే ఇటు డ్యాన్సర్‌గా సంగీత కళామతల్లికి నిత్య నృత్యాభిషేకం చేస్తున్నారు. - సాక్షి స్కూల్ ఎడిషన్ -
మహిళకు స్ఫూర్తి.. సంధ్య.
కాకినాడ : ఓ మారుమూల కుగ్రామంలో పదో తరగతి పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం విశాఖ వెళ్ళిన ఆమెకు బయటి ప్రాంతాలకు వెళ్ళి చదవడంలో అమ్మాయిలు ఎదుర్కొనే ఇబ్బందులను స్వయంగా అనుభవమైంది. పురుషులతో సమానంగా మహిళలకు ఉన్నత చదువులు చదవాలన్న ఆమె ఆకాంక్ష మహిళల కోసం ప్రత్యేక కళాశాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు బీజం పడింది. అలా ఓ చిన్న కళాశాల నుంచి ప్రారంభమై ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, బీఎడ్, డీఎడ్, ఎమ్బీఏ, ఎమ్సీఏ సహా ఎన్నో మహిళా కళాశాలలు ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు. ఆమే కాకినాడ కేంద్రంగా నడుస్తున్న వీఎస్లక్ష్మి కరస్పాండెంట్ సంధ్య. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని కోడూరు గ్రామంలో పదో తరగతి వరకు చదివిన ఆమె ఇంటర్, డిగ్రీలను క్రమ శిక్షణకు మారుపేరైన విశాఖ భారతీయ విద్యాకేంద్రంలో పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ (ఫిజిక్స్) పూర్తిచేసిన ఆమె 1990లో వివాహమయ్యాక కాకినాడలో స్థిరపడ్డారు. విద్యపట్ల ఉన్న మక్కువ, మనోస్థైర్యం గమనించిన ఆమె మామ డాక్టర్ వీవీ కృష్ణంరాజు ప్రోత్సాహంతో 1998లో వీఎస్లక్ష్మీ మహిళా విద్యాసంస్థల ఏర్పాటుకు తోడ్పాటునందించారు. అలా ప్రారంభమైన మహిళా కళాశాల ప్రస్థానం అంచెలంచెలుగా గడిచిన 19 ఏళ్ళలో ఎంతోమంది అమ్మాయిలను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. కేవలం మహిళల కోసమే ఏర్పాటైన ఈ విద్యాసంస్థ అమ్మాయిల అభిరుచులకు అనుగుణంగా ఇంటర్, డిగ్రీలతోపాటు వారివారి అభిరుచులకు అనుగుణంగా నచ్చిన కోర్సులో చేరేందుకు వీలుగా ఎన్నో అనుబంధ కోర్సులకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ చదివిన ఎంతో మంది అమ్మాయిలు ఇప్పుడు దేశ, విదేశాల్లో రీసెర్చ్ ఫ్రొఫెసర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు.దాదాపు 17 వేల మందికి పైగా మహిళలు సంధ్య పర్యవేక్షణలోని కళాశాలలో చదివి ఇప్పుడు పదిమందికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.