AKS CEO Nidhi Yadav Success Story, Net Worth Details in Telugu - Sakshi
Sakshi News home page

Nidhi Yadav: లక్షలతో మొదలైన వ్యాపారం రూ. కోట్లలో టర్నోవర్.. బిటెక్ యువతి సక్సెస్ స్టోరీ

Published Thu, May 18 2023 7:08 PM | Last Updated on Tue, May 23 2023 4:47 PM

AKS Co-Founder and CEO Nidhi Yadav Success Story - Sakshi

AKS Co-Founder and CEO Nidhi Yadav: జీవితంలో ఎదగాలంటే నిరంతర కృషి, పట్టుదల అవసరం. చదివిన ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. పది మందికి ఉద్యోగం కల్పించే పని ఏదైనా చేయవచ్చు. ఇలా ఆలోచించే వారి సంఖ్య గతంలో తక్కువగా ఉన్నా.. ప్రస్తుతం పెరుగుతూనే ఉంది. ఈ కోవకు చెందినవారిలో ఒకరు 'నిధి యాదవ్' (Nidhi Yadav). ఇంతకీ నిధి యాదవ్ ఎవరు? ఆమె చేస్తున్న బిజినెస్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

కరణ్ సింగ్ యాదవ్ & రాజ్‌బాల యాదవ్‌లకు జన్మించిన నిధి యాదవ్ 2004లో ఇండోర్ పబ్లిక్ స్కూల్‌లో ఇంటర్ పూర్తి చేసింది. ఆ తరువాత ఇండోర్‌లోని జిఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత కంప్యూటర్ ఇంజనీర్ ఉద్యోగానికి డెలాయిట్‌లో జాయిన్ అయ్యింది. అయితే ఆమెకు ఉద్యోగం చేయడం ఏ మాత్రం ఇష్టం లేదు. కాబట్టి సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో ఫ్లోరెన్స్‌లోని పోలిమోడా ఫ్యాషన్ స్కూల్‌లో ఒక సంవత్సరం కోర్సును పూర్తి చేసింది. ఇది పూర్తయిన తరువాత ఇటలీలో ఉద్యోగం వచ్చినా కుటుంబానికి దూరంగా ఉండలేక అది కూడా వద్దనుకుంది. 

సొంత కంపెనీ ప్రారంభం.. 
ఆ తరువాత 2014లో రూ. 3.5 లక్షల పెట్టుబడితో AKS పేరుతో కంపెనీ ప్రారంభించింది. ఇందులో సరసమైన ధరలకే అద్భుతమైన దుస్తులను 18 నుంచి 35 సంవత్సరాల వయసున్న వారికి విక్రయించడం ప్రారభించింది. కంపెనీ స్థాపించడానికి కొంత సమయం పట్టినప్పటికీ కేవలం ఐదు సంవత్సరాల్లో టర్నోవర్ రూ. 100 కోట్లు (2019-2020 ఆర్థిక సంవత్సరం) దాటింది.

(ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!)

నిజానికి ఆమె కంపెనీ ప్రారంభించాలనే ఆలోచనను తన కుటుంబంతో చెప్పినప్పుడు ఒక్క సారిగా ఆశ్చర్యపోయినప్పటికీ తరువాత మద్దతుగా నిలిచారు. కంపెనీ ప్రారంభించాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడవుతున్న దాదాపు అన్ని బ్రాండ్స్ గురించి ఏకంగా ఆరు నెలలు పరిశోధన చేసింది. సంస్థ మొదలైన మొదటి సంవత్సరమే ఆమె రూ. 1.60 కోట్లు సంపాదించింది. ఆ తరువాత ఏడాదికి అది రూ. 8.50 కోట్లకు చేరింది. 2018 నాటికి కంపెనీ ఆదాయం ఏకంగా 48 కోట్లకు చేరడం విశేషం.

(ఇదీ చదవండి: రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!)

నిధి యాదవ్ AKS కంపెనీ ప్రధాన కార్యాలయం గుర్గావ్‌లో ఉంది. 2021 చివరినాటికి సంస్థ ఆదాయం రూ. 200 కోట్లకు చేరినట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. కరోనా సమయంలో కంపెనీ కొన్ని సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, అలాగే అవకాశాలు కూడా ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగానే మాస్క్‌లు, పిపిఈ కిట్ల తయారీని మొదలుపెట్టారు. ఆ తరువాత పిల్లలకు కూడా దుస్తులు తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు. 2023-2024 నాటికి కంపెనీ టర్నోవర్ రూ. 500 కోట్లకు పెంచాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement