అమరావతి సభలో సీఎం చంద్రబాబు ప్రకటన
సాక్షి, విజయవాడ బ్యూరో: పంచారామంగానూ, బౌద్ధక్షేత్రంగా అలరారుతున్న అమరావతిని వారసత్వ నగరంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఇందుకోసం హృదయ్, ప్రసాద్ పథకాల కింద కేంద్రం మంజూరు చేసిన రూ.52.62 కోట్లకు రాష్ట్రప్రభుత్వ వాటా కింద మరో రూ.50 కోట్లను మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. మొత్తం రూ.102 కోట్లతో అమరావతి ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. శనివారం సాయంత్రం కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, రాష్ట్రమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్‌లతో అమరావతి చేరుకున్న సీఎం పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాల్లోని 39 గ్రామాలకు తాగునీరందించే సమగ్ర రక్షిత మంచినీటి పథకాలకు, రూ.22.26 కోట్లతో చేపట్టే పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు ఎదురుగా ఏర్పాటుచేసిన సభలో సీఎం ప్రసంగించారు.ధ్యానబుద్ధకు ఎదురుగా 16 ఎకరాల ఖాళీ భూముల్ని కలిగిన రైతులు వాటిని పూలింగ్‌పద్ధతిలో ఇచ్చేందుకు ముందుకొచ్చి కోర్టులోని కేసుల్ని ఉపసంహరించుకోవాలని, వారు ముందుకు రాకుంటే.. తానే ఆయా కేసుల్ని విత్‌డ్రా చేయించి భూములు తీసేసుకుంటామని సీఎం చెప్పారు. కాగా హిమాలయ బుద్ధిస్ట్ ప్రాజెక్టు.. ధరణికోట మ్యూజియం అభివృద్ధికి ముందుకొస్తున్నదని, ఇందుకోసం ఇక్కడున్న మరో 50 ఎకరాల్ని భూసమీకరణ పద్ధతిలో సేకరిస్తామన్నారు.
అమరావతి శిల్పసంపదను వెనక్కు తెప్పిస్తాం: వెంకయ్యనాయుడు
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబుతో మాట్లాడి లండన్ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్ప సంపదను వెనక్కి తెప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. వారసత్వ నగరంగా అభివృద్ధిచెందే అమరావతిలో భారీ ఉద్యానవ నం నిర్మించేందుకు కేంద్రం పరిశీలన జరుపుతోందన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అమరావతి సిటీ హృదయ్ ప్లాన్‌ను ఆవిష్కరించారు.
వారసత్వ నగరంగా అమరావతి
Published Sun, Dec 6 2015 2:33 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM
Advertisement
Advertisement