
నా చావుతోనైనా కాపులను బీసీల్లో చేర్చాలి
బలిజ కులంలో పుట్టించావు, కూటికి పేదను చేశావు, పేరుకు పెద్ద ఓసీ కులం. నాకు ఉండటానికి ఇల్లు లేదు. తింటానికి తిండి లేదు.
పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న రమణయ్య
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/సీఎస్‌పురం: బలిజ కులంలో పుట్టించావు, కూటికి పేదను చేశావు, పేరుకు పెద్ద ఓసీ కులం. నాకు ఉండటానికి ఇల్లు లేదు. తింటానికి తిండి లేదు. నేను వైరింగు (ఎలక్ట్రీషియన్) చేసి బతుకుతున్నాను. నా కులాన్ని బీసీల్లో చేరిస్తే నా పిల్లలు, వారి పిల్లలైనా బతుకుతారనుకున్నాను. కానీ మమ్మల్ని బీసీలో చేరుస్తారని నమ్మకం కలగడం లేదు. నా చావుతో అయినా మా కులాన్ని బీసీల్లో చేరుస్తారని నేను చనిపోతున్నాను’ ఇదీ కాపులను బీసీల్లో చేర్చాలంటూ తాటి రమణయ్య అనే వ్యక్తి పురుగుమందు తాగి చనిపోతూ రాసిన సూసైడ్ నోటు.
ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం కనిగిరి నియోజకవర్గం చంద్రశేఖరపురం(సీఎస్ పురం)లో చోటు చేసుకుంది. గ్రామంలోని సందుగడ్డ వీధికి చెందిన తాటి రమణయ్య ముద్రగడ పద్మనాభం చేస్తున్న నిరాహార దీక్షపై ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణితో ఇక బీసీల్లో చేరుస్తారన్న నమ్మకం కోల్పోయాడు. అందుకే ఆత్మహత్య చేసుకుంటానని ఉదయం నుంచి పలువురికి చెప్పాడు. అయితే ఎవరూ పట్టించుకోలేదు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రమణయ్య పురుగుమందు తాగాడు. నీళ్లు తేవడానికి ట్యాంకు వద్దకు వెళ్లిన భార్య రాములమ్మ తిరిగి వచ్చేసరికి రమణయ్య నురగలు కక్కుకుంటూ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పక్కనే పురుగుల మందు డబ్బా పడి ఉంది. దీంతో ఆమె ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే రమణయ్య మృతి చెందాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి, మృతుని జేబులోని సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్నారు.
గుండెపోటుతో ఇద్దరి మృతి
పి.గన్నవరం/ బిట్రగుంట: కాపు ఉద్యమం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, రిజర్వేషన్లు రావన్న భయంతో గుండెపోటుతో ఇద్దరు మరణించారు. బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం జి.పెదపూడి రాజీవ్ కాలనీకి చెందిన కాపు నాయకుడు బొరుసు వీరవెంకట సత్యనారాయణ (60) వ్యవసాయ కూలీగా . ముద్రగడ ఆమరణ దీక్షకు మద్దతుగా గ్రామంలో జరిగిన రిలే దీక్షల్లో పాల్గొన్నాడు. సోమవారం ఉదయం ఇంట్లో ముద్రగడ దీక్షను టీవీలో చూస్తూ గుండెపోటుకు గురై మరణించాడు. రిజర్వేషన్లు రావన్న బెంగతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం తాళ్లూరుకు చెందిన యువకాపునాడు మండల అధ్యక్షుడు లక్కాకుల పద్మానాయుడు(43) గుండెపోటుతో కన్నుమూశాడు. కాపు ఉద్యమంలో భాగంగా పద్మానాయుడు నిరసనల్లో పాల్గొన్నాడు.