అనాలోచిత నిర్ణయాలతోనే ఆత్మహత్యలు | Suicides are unfair decisions | Sakshi
Sakshi News home page

అనాలోచిత నిర్ణయాలతోనే ఆత్మహత్యలు

Published Wed, Jun 21 2017 12:16 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Suicides are unfair decisions

- వ్యవసాయ రంగ పరిరక్షణకు పోరాటాలే శరణ్యం
- ఏఐఏడబ్ల్యూఎఫ్‌ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్‌
– ప్రారంభమైన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల ప్రతినిధుల సమావేశం
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి విజయ రాఘవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 27వ మహాసభల్లో భాగంగా రావూరి గార్డెన్స్‌లో రెండోరోజు ప్రతినిధుల సభ ప్రారంభమైంది. కార్మిక సంఘం పతాకాన్ని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు పాటూరి రామయ్య ఆవిష్కరించి అమరులకు నివాళ్లర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో విజయ రాఘవన్‌ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేయడాన్ని, రైతాంగ ఆత్మహత్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా అభిశంసించినా కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు.
 
పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరిన రైతులపై పోలీసులు విక్షణారహితంగా కాల్పులు జరపడం సిగ్గుచేటన్నారు. ఎరువులు, విద్యుత్, నీటి సరఫరా, విద్య, వైద్యం చివరకు ఆహార భద్రత..ఇలా ఎలాంటి సబ్సిడీలు ఉండదరాని, నీతి అయోగ్‌ చెబుతున్న నేపథ్యంలో వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అసవరం ఆసన్నమైందన్నారు. పేదలకు భూములను పంచే భూసంస్కరణల చట్టాన్ని ప్రభుత్వాలు రివర్స్‌లో అమలు చేస్తున్నాయన్నారు. పేదలకు భూములు ఇవ్వకపోగా..వారి వద్ద ఉన్న భూములను లాక్కుంటున్నాయన్నారు. దళితులు, ఆదివాసులను హీనంగా చూస్తున్నారని, ఆవుకు ఇచ్చే గౌరవాన్ని సాటి మనసులకు ఇవ్వని ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి కరడుగట్టిన మతోన్మాదుల కనుసన్నల్లో నడుస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు పోరాటాలే శరణ్యమన్నారు.
 
రాష్ట్రంలోని తెలుగు దేశం ప్రభుత్వం కూడా కేంద్రంతో పోటీ పడి రైతులు, వ్యవసాయ కార్మికుల వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రపంచ బ్యాంకుకు రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మారుస్తున్నారని, ఈ విధానాలను ప్రతిఘటించాలన్నారు. అంతకముందుకు ఈ మహాసభల ప్రారంభ సభలో రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి.పుల్లయ్య అధ్యక్ష ఉపన్యాసం చేశారు. మహాసభలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారావు, వెంకటేశ్వర్లు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిరమాదేవి, కేవీపీఎస్‌ రాస్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, సీపీఎం నాయకులు నరసింహయ్య, కె.ప్రభాకారరెడ్డి, టి.రమేష్‌కుమార్‌ పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement