
కొలువు లేదని తనువు చాలిస్తున్నారు!
కష్టపడి చదివిన డిగ్రీలు, మాస్టర్ డిగ్రీలు ఎందుకూ కొరగానివవుతున్నాయి. పీహెచ్‌డీలు సైతం పనికిమాలిన పత్రాలుగా మారిపోతున్నాయి
♦ రాష్ట్రంలో ఏటా 4 వేల మంది పురుగు మందు తాగి ఆత్మహత్య
♦ బాధితుల్లో 34 శాతం మంది 30 ఏళ్లలోపు వారే
♦ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోనే అధికం
♦ ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక విలవిల
సాక్షి, హైదరాబాద్: కష్టపడి చదివిన డిగ్రీలు, మాస్టర్ డిగ్రీలు ఎందుకూ కొరగానివవుతున్నాయి. పీహెచ్‌డీలు సైతం పనికిమాలిన పత్రాలుగా మారిపోతున్నాయి. వయసు మీరిపోతున్నా ఉద్యోగం రాకపోవడం, కుటుంబ భారం, అసమర్థులుగా మిగిలిపోతున్నామన్న బాధ, పేదరికం... వెరసి రాష్ట్రంలో పురుగు మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కటంటే ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోవడం, ప్రైవేట్ రంగంలోనూ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండటంతో పేదింట విషాద ఛాయలు నెలకొంటున్నాయి.
వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు, ఎమర్జెన్సీ మొబైల్ అంబులెన్స్‌లు... తదితరాల నుంచి సేకరించిన సమాచారం మేరకు గతేడాది ఏపీలోని 13 జిల్లాల్లో 4 వేల మంది పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలనూ తొలగిస్తుండడంతో యువలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. బతకడానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది బలవన్మరణానికి పాల్పడ్డవారిలో పురుషులు 70 శాతం, మహిళలు 30 శాతం ఉన్నారు.
తెల్లరేషన్ కార్డుదారులే ఎక్కువ
పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువతలో ఎక్కువ శాతం మంది తెల్లరేషన్ కార్డుదారులే కావడం గమనార్హం. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల నుంచే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు వివిధ ప్రభుత్వాసుపత్రులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వెల్లడైంది. నెల్లూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఆసక్తిరకమైన అంశం ఏమిటంటే మృతుల్లో ఎక్కువ మంది వెనుకబడిన కులాలకు చెందినవారే ఉంటున్నారు. రాష్ట్రంలో ప్రతినెలా కనీసం 350 నుంచి 400 మంది పురుగు మందు తాగి తనువు చాలిస్తున్నట్లు తెలుస్తోంది.
వివిధ ప్రభుత్వ ఆసుత్రులకు వచ్చే ఎమర్జెన్సీ కేసుల్లో 0.5 నుంచి 0.7 శాతం కేసులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వారే ఉన్నారు. విచిత్రమేమంటే ఇలాంటి వారిలో గ్రామీణ ప్రాంతాలవారు 65 శాతం, పట్టణ ప్రాంతాల వారు 29 శాతం, గిరిజన ప్రాంతాల వారు 6 శాతం ఉంటున్నారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వాసుపత్రుల్లో 79 శాతం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12 శాతం నమోదవుతున్నాయి.