సురభి .. మాయాజాలం
కెమెరా జిమ్మిక్కులు లేవు.. కంప్యూటర్ గ్రాఫిక్స్‌లూ లేవు.. అయినా వాటిని తలదన్నేలా మాయలు, మంత్రాలు చేశారు. రెప్ప వేసి తెరిచేలోగా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. స్పెషల్ ఎఫెక్ట్స్‌తో రంగ స్థలంపై మంటలు పుట్టించడం, వర్షం కురిపించడం, వస్తువులను అదశ్యం చేయడం.. ఔరా అనిపించాయి. సురభి నాటకాల ప్రదర్శనలో భాగంగా మాయాబజార్ ప్రదర్శన సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది.
విశాఖ–కల్చరల్: కళాభారతి ఆడిటోరియంలో బుధవారం సురభి నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభ మయ్యాయి. రంగసాయి నాటక సంఘం నేతత్వంలో మూడు రోజులపాటు జరిగే సురభి నాటకాల ప్రదర్శనలో భాగంగా తొలిరోజు మాయాబజార్ నాటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 131 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవేంకటేశ్వర నాట్యమండలి(సురభి–హైదరాబాద్) కళాకారులు ప్రదర్శించిన మాయాబజార్ నాటకం ఆద్యంతం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.
అబ్బురపరిచిన సెట్టింగ్‌లు
ఈ నాటకంలో ఘటోత్కచుడు గుహ సెట్టింగ్ ఆకట్టుకుంది. అభిమన్యుడు, ఘటోత్కచుడు మాయా యుద్ధంలో ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్ర ప్రభావంతో మంటలు, నీరు స్టేజ్‌పై ఆకస్మాత్తుగా రావడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఒకే వేదికపై శశిరేఖ–అభిమన్యుడు వేర్వేరు దశ్యాలలో విరహ గీతాలాపన మైమరిపించింది. శ్రీకృష్ణుడు, బలరాముడు, శశిరేఖ, అభిమన్యుడు, నారదుడు తదితర పాత్రల్లో ఆయా కళాకారులు చక్కటి ఆహార్యంతో తమ హావభావాలను ప్రదర్శిస్తూ పద్యాలు పాడుతూ రక్తికట్టించారు. ప్రతి కళాకారుడు మనస్సుకు హత్తుకుపోయే విధంగా ప్రదర్శించి ఆయా పాత్రల్లో లీనమైపోయారు. మల్లాది వేంకటకృష్ణ శర్మ దర్శకత్వంలో ఎ.మనోహార్, ఆర్.నాగేశ్వరరావు(బాబ్జీ)ల నిర్వహణలో అద్భుత దృశ్యాలు సష్టించారు. వెంకటేశ్వరరావు సారథ్యంలో 65 మంది కళాకారులు ఈ నాటకానికి జీవం పోశారు. తొలుత ఈ నాటక ప్రదర్శనను ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, విజయ నిర్మాణ్ కంపెనీ అధినేత ఎస్.విజయకుమార్, టి.సరస్వతీదేవి, ఆదాయ పన్నుల శాఖ అధికారి హర్షవర్థన్, సురభి రథసారథి బాబ్జీ, రంగసాయి నాటక సంఘం అధ్యక్షుడు బాదంగీర్ సాయి తదితరులు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.