ఆర్‌ఎంపీ నాలుగో భార్య అనుమానాస్పద మృతి
ముగ్గురు భార్యలు వదిలిపెట్టి వెళ్లిపోయిన ఓ ఆర్ఎంపీ డాక్టర్.. నాలుగోపెళ్లి చేసుకోగా, ఆ భార్య అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ ఘటన కృష్ణాజిల్లా కంచికచర్లలో శుక్రవారం వెలుగుచూసింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి గత పదేళ్లుగా కంచికచర్లలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో రెండేళ్ల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన సుందరమ్మను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఆమె అనుమానాస్పదంగా మృతి చెందింది. సుందరమ్మ మృతికి శ్రీనివాస్ రెడ్డి కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి. మొదట్లో అతడు మధిరకు చెందిన విజయలక్ష్మీని పెళ్లాడాడు. పెళ్లయిన మూడు నెలల తరువాత.. ఆమె తాను ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. దీంతో కొన్ని రోజుల తరువాత కంచికచర్లకి వచ్చి స్థిరపడ్డాడు. ఆ తర్వాత వీరులపాడు మండలం కొణతాలపల్లి గ్రామానికి చెందిన కుమారి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన శ్రీనివాస్‌రెడ్డి ఆమెతో తెగతెంపులు చేసుకొని అదే గ్రామానికి చెందిన రాధను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా రెండేళ్ల క్రితం ఇల్లు వదిలి పారిపోయింది. దీంతో గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన సుందరమ్మను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఆమె శుక్రవారం రోజు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
వైపు సుందరమ్మ తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని శ్రీనివాస్‌రెడ్డే హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. తామ కూతురు చాలా ఆరోగ్యంగా ఉండేదని, ఆమెకు గుండెపోటు వచ్చిందని శ్రీనివాస్ రెడ్డి అబద్ధాలాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.