రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లెలో గడపగడప వైఎస్సార్ కార్యక్రమంలో కరపత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి
– గడప గడపకూ వైఎస్సార్‌లో ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి
రామసముద్రం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన స్వలాభం కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం రామసముద్రం మండలం పెద్దకుప్పల్లె పంచాయతీలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలు, తప్పుడు హామీలపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని అన్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చి హోదాతో ఒరిగేదేమీ లేదని చెప్పడం దారుణమన్నారు. రాయలసీమ ప్రజలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నా సీఎం పట్టించుకోకుండా సింగపూర్. లండన్ అంటూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులైనా రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. గ్రామాల్లోకి వెళితే ప్రజలు పెన్షన్లు, ఇళ్లు, నష్టపరిహారం, రుణమాఫీ తదితరాలపై నిలదీస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పాపానపోలేదన్నారు. అనంతరం తిరుమలరెడ్డిపల్లెలో ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీ జరీనాహైదర్‌బేగం, జెడ్పీటీసీ సీహెచ్.రామచంద్రారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు కేశవరెడ్డి, ఉపాధ్యక్షుడు రెడ్డెప్ప, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ సర్పంచు బాస్కర్‌గౌడు, ఎంపీటీసీలు రెడ్డెప్పనాయుడు, శంకర, ఆనంద, వైఎస్సార్‌సీపీ మండల మహిళా అధ్యక్షురాలు శాంతమ్మ, నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షుడు తిమ్మయ్య, కో–ఆప్షన్ సభ్యులు మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.