స్వర్ణభారత్ సేవలు ప్రసంశనీయం
కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు
వెంకటాచలం : గ్రామీణ ప్రజల కోసం స్వర్ణభార త్‌ట్రస్ట్ చేసే సేవలు ప్రసంశనీయమని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు అభినందించారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ట్రస్ట్, అక్షర విద్యాలయాన్ని కేంద్ర సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో కలిసి ఆదివారం సందర్శించారు. తొలుత స్వర్ణభారత్ ట్రస్ట్‌కు వెళ్లి అక్కడ బ్రిడ్జిస్కూల్, రైతు శిక్షణ కేంద్రం, ఎల్వీప్రసాద్ కంటి వైద్యశాల, సైరెడ్‌లో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణను పరిశీలించారు. అనంతరం అక్షర విద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ సోమా ఆధ్వర్యంలో యువతకు వత్తి నైపుణ్యతపై జరుగుతున్న శిక్షణ గురించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆయనకు వివరించారు. అనంతరం కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు విలేకరులతో మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు ప్రతిచోటా స్వర్ణభారత్ ట్రస్ట్ లాంటి స్వచ్ఛందసంస్థలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలకశాఖా మంత్రి పి.నారాయణ, నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.
రైతుల సమస్యకు పరిష్కారం చూపాలి:
రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని మండలంలోని చవటపాళెం గ్రామ రైతులు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కోరారు. వెంకటాచలం మండలం అక్షర విద్యాలయానికి వచ్చిన వెంకయ్యనాయుడును చవటపాళెం రైతులు కలిసి మాట్లాడారు. కష్ణపట్నం–ఓబులవారిపల్లెకు వెళ్లే రైల్వే మార్గంలో చవటపాళెం వద్ద చేపడుతున్న రైల్వే పనుల కారణంగా రైతులకు ఇబ్బందులు వస్తాయని తెలియజేశారు. స్పందించిన వెంకయ్యనాయుడు ఆర్డీఓ కాసా వెంకటేశ్వర్లు, రైల్వే అధికారులతో మాట్లాడారు. ఆ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.