వెంకటేశం కుటుంబాన్ని పరామర్శిస్తున్న స్వీడన్ దేశస్తులు
- అన్నదాతల ఆత్మహత్యలపై ప్రభుత్వానికి నివేదిక
జగదేవ్‌పూర్: మండలంలోని లింగారెడ్డిపల్లిలో నాలుగు నెలల క్రితం రైతు చిక్కుడు వెంకటేశం ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతంపై గురువారం తెలంగాణ రైతు రక్షణ సమితి, రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో స్వీడన్ దేశస్థురాలు మయా, లాయిన్ అధ్యయనం చేశారు. సాయంత్రం 4 గంటలకు వారు గ్రామానికి చేరుకుని చిక్కుడు వెంకటేశం భార్య లలిత, ఇద్దరు పిల్లల కుటుంబ పరిస్థితులను ఆడిగి తెలుసుకున్నారు.
గంటకు పైగా వెంకటేశం ఆత్మహత్య గల కారణాలను, కుటుంబ ఆర్థిక పరిస్థితులను వారు ఆరా తీశారు. భార్య లలిత మాట్లాడుతూ తమకున్న రెండెకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేసేవారిమని, గత కొన్నేళ్లుగా వర్షభావ పరిస్థితుల వల్ల పంటలు పండకపొవడంతో సాగుకు చేసిన అప్పులు ఎక్కువయ్యాయని వివరించారు. అనంతరం స్వీడన్ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై అధ్యయనం చేస్తున్నామన్నారు.
రెండు రోజుల నుంచి తెలంగాణలో వివిధ జిల్లాలో రైతు ఆత్మహత్య కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేశామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశామని, సమావేశంలో రైతు ఆత్మహత్యలకు కారణాలను వివరిస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులిరాజు, రైతు స్వరాజ్య వేధిక రాష్ట్ర నాయకులు కొండల్‌రెడ్డి, చంద్రం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.