jagadevpur mandal
-
నాడు నాన్న.. నేడు అమ్మ! ..
సాక్షి, మెదక్: తండ్రి, తల్లి మృతితో నా అనేవారు లేక ఓ బాలిక అనాథగా మారింది. సర్పంచ్, గ్రామస్తులు ముందుకు వచ్చి అంత్యక్రియలు చేసిన ఘటన జగదేవ్‌పూర్ మండలం రాయవరం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన గుమ్ల రాములు, మల్లవ్వ దంపతులకు కూతురు రేణుక ఉంది. రేణుక వర్గల్ కస్తూర్బాలో ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. రాములు పదేళ్ల క్రితం మృతి చెందగా, మల్లవ్వ తన కూతురుతో కలిసి రెండేళ్లుగా కుకునూర్‌పల్లిలో ఉంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో మల్లవ్వ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం మృతిచెందింది. బంధువులు ఎవరు రాకపోవడంతో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని ఉంచారు. విషయం తెలుసుకున్న రాయవరం సర్పంచ్ పావని మల్లవ్వ శనివారం అంత్యక్రియలకు సాయం అందించారు. తల్లిదండ్రుల మృతితో అనాౖథెన బాలికను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. (చదవండి: అర్థరాత్రి తప్పతాగి ఎస్ఐని ఢీకొట్టారు.. తీవ్రగాయాలతో..) -
అత్యాచార ఘటన సమాజానికి తలవంపు
సాక్షి, హైదరాబాద్: జగదేవ్‌పూర్ మండలం రామారంలో దళిత బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని బీజేపీ ప్రధానకార్యదర్శి చింతా సాంబమూర్తి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. ఘనట జరిగి 2 రోజులైనా దోషు లను అరెస్టు చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. వెంటనే దోషులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి 5 ఎకరాల భూమి, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
రైతు ఆత్మహత్యలపై స్వీడన్ అధ్యయనం
అన్నదాతల ఆత్మహత్యలపై ప్రభుత్వానికి నివేదిక జగదేవ్‌పూర్: మండలంలోని లింగారెడ్డిపల్లిలో నాలుగు నెలల క్రితం రైతు చిక్కుడు వెంకటేశం ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతంపై గురువారం తెలంగాణ రైతు రక్షణ సమితి, రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో స్వీడన్ దేశస్థురాలు మయా, లాయిన్ అధ్యయనం చేశారు. సాయంత్రం 4 గంటలకు వారు గ్రామానికి చేరుకుని చిక్కుడు వెంకటేశం భార్య లలిత, ఇద్దరు పిల్లల కుటుంబ పరిస్థితులను ఆడిగి తెలుసుకున్నారు. గంటకు పైగా వెంకటేశం ఆత్మహత్య గల కారణాలను, కుటుంబ ఆర్థిక పరిస్థితులను వారు ఆరా తీశారు. భార్య లలిత మాట్లాడుతూ తమకున్న రెండెకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేసేవారిమని, గత కొన్నేళ్లుగా వర్షభావ పరిస్థితుల వల్ల పంటలు పండకపొవడంతో సాగుకు చేసిన అప్పులు ఎక్కువయ్యాయని వివరించారు. అనంతరం స్వీడన్ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. రెండు రోజుల నుంచి తెలంగాణలో వివిధ జిల్లాలో రైతు ఆత్మహత్య కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేశామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశామని, సమావేశంలో రైతు ఆత్మహత్యలకు కారణాలను వివరిస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులిరాజు, రైతు స్వరాజ్య వేధిక రాష్ట్ర నాయకులు కొండల్‌రెడ్డి, చంద్రం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షం కురిసే.. నీళ్లు నిలిచే!
ఇళ్లలోకి నీరు చేరడంతో ఇబ్బందులు పడిన ప్రజలు జగదేవ్‌పూర్: మండలంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తిగుల్ గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు, మిషన్ భగీరథ పనుల కారణంగా ప్రధాన వీధుల్లో మురికి కాల్వలు లేకుండాపోయాయి. వర్షం కురవడంతో నీరు రోడ్డుపై నిలిచింది. దీంతో కొంత సేపు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలాగే బీసీ కాలనీలో మురికి కాల్వలు నిండి నీళ్లు ఇళ్లలోకి చేరాయి. ఇళ్లలోని నీళ్లను బయటికి ఎత్తిపోసుకున్నారు. కాలనీవాసులు మాట్లాడుతూ నీళ్లు వెళ్లేందుకు మురికి కాలువలు ఏర్పాటు చేయాలని అధికారులను కొరారు. -
రేషన్.. డోర్ డెలివరీ..!
సీఎం సొంత నియోజకవర్గంలో వినూత్న ప్రయోగం జగదేవ్‌పూర్: గజ్వేల్...కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. కేసీఆర్ మదిలో మెదిలే ఆలోచనలన్నీ ఇక్కడి నుంచే కార్యరూపం దాల్చుతాయి. సాగు పద్ధతులే కాదు..అన్నింటా సరికొత్త విధానాలు ఉండాలని కేసీఆర్ భావిస్తుంటారు. కేసీఆర్ నయా ట్రెండ్‌ను ఫాలో అయిన గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం పిటి వెంకటాపూర్ డీలర్ మహేందర్‌రెడ్డి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కార్డుదారులెవరూ రేషన్‌దుకాణాల ముందు బారులు తీరకుండా రేషన్ సరకులను కార్డుదారుల ఇంటికే డోర్ డెలివరీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ (గడా) ఓఎస్డీ హన్మంతరావు, సివిల్ సప్లయ్ డివిజన్ అధికారి ఆనందరావులకు తెలిపారు. వారి అనుమతితో ఈ ప్రయోగాన్ని సోమవారం ప్రారంభించారు. గ్రామంలోని 147 మంది కార్డుదారుల ఇంటింటికీ వెళ్లి రేషన్ సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గడా ఓఎస్డీ హన్మంతరావు మాట్లాడుతూ, రేషన్ సరుకులను కార్డుదారుల ఇళ్లకే వెళ్లి ఇవ్వడం మంచిదైనప్పటికీ, కొంచెం ఖర్చు కూడా ఉంటుందన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందన్నారు.