స్వైపింగ్ బాదుడు.. చార్జీల కుమ్ముడు
Published Fri, Jan 20 2017 2:01 AM | Last Updated on Thu, May 24 2018 1:29 PM
ఏలూరు (మెట్రో)/తణుకు : నగదు రహిత లావాదేవీలు జరపాలని ప్రభుత్వం, అధికారులు ఊదరగొడుతుండటంతో తాడేపల్లిగూడెంకు చెందిన యోహాన్ అనే యువకుడు కరెంటు బిల్లు చెల్లించేందుకు డెబిట్ కార్డు తీసుకెళ్లాడు. ఆ కార్డు సాయంతో మీ సేవ కేంద్రంలో కరెంటు బిల్లు నిమిత్తం రూ.460 చెల్లించాడు. సర్వీస్ చార్జీల రూపంలో రూ.5, డెబిట్ కార్డు వినియోగించినందుకు ట్యాక్స్ రూపంలో రూ.5 అతడి ఖాతా నుంచి ఎగిరిపోయాయి. జంగారెడ్డిగూడెంకు చెందిన అరవింద్‌కుమార్ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వారం రోజుల వ్యవధిలో ఏడుసార్లు ఏటీఎం కార్డును ఉపయోగించి నగదు డ్రా చేశాడు. తీసుకున్న సొమ్ము పోగా తన పొదుపు ఖాతాలో ఉండాల్సిన నిల్వ మొత్తంలో రూ.200 తగ్గాయి. బ్యాంక్‌కు వెళ్లి ఇదేమిటని అడిగితే.. ఏటీఎం కార్డును ఐదు పర్యాయలకంటే ఎక్కువసార్లు వినియోగిస్తే చార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. తణుకు పట్టణానికి చెందిన పి.పోసిబాబు మోటార్ సైకిల్ కొనుక్కుందామని షోరూమ్‌కు వెళ్లా డు. అతనికి చెక్కు బుక్ లేకపోవడంతో డెబిట్ కార్డు ద్వారా స్వైపింగ్ విధానంలో సొమ్ము చెల్లిస్తానన్నాడు. అలాగైతే 2 శాతం పన్ను కింద రూ.1,300 అదనంగా చెల్లించాల్సి వస్తుందని చెప్పడంతో వెనుదిరిగి వచ్చేశాడు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమçలు ఇవి. పెద్ద నోట్ల రద్దు తరువాత తీవ్ర ఇబ్బందులు పడిన జనం ప్రభుత్వ సూచనల మేరకు నగదు రహిత లావాదేవీల వైపు క్రమంగా మళ్లుతున్నారు. అయితే, సేవా రుసుములు, పన్నుల పేరిట భారీ దోపిడీకి గురవుతున్నారు.
మీ డబ్బు మీరు తీసుకున్నా..
జిల్లాలోని ఏటీఎం సెంటర్లలో రూ.2 వేలు, రూ.500 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. చిల్లర సమ స్య నేపథ్యంలో ప్రజలు రూ.2 వేల నోట్లను తీసుకునేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఏటీఎం నుంచి ఒకసారి రూ.1,500 తీసుకుంటే మాత్రమే రూ.500 నోట్లు వస్తున్నాయి. అంతకుమించి ఎక్కువ తీసుకుంటే రూ.2 వేల నోట్లు వస్తున్నాయి. ఉదాహరణకు రూ.10 వేలు కావాలంటే రూ.2 వేల నోట్లు 5 వస్తున్నాయి. దీంతో.. ఏటీఎంల నుంచి రూ.1,500 చొప్పున 7 పర్యాయాలు సొమ్ము తీసుకోవాల్సి వస్తోంది. ఐతే, నెలలో 5పర్యాయాలకు మించి ఏటీఎం కార్డు ఉపయోగిస్తే ప్రతి లావాదేవీపై రూ.20 రుసుం, ఆపై 15 శాతం పన్నును బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. దీంతో, వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.
నగదు రహిత లావాదేవీలపైనా బాదుడే
వివిధ వస్తువుల కొనుగోళ్లు కోసం వినియోగించే డెబిట్, క్రిడెట్ కార్డు లావాదేవీలకు సేవా రుసుం నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించినా జిల్లాలో అమలుకు నోచుకోలేదు. ఇలాంటి లావాదేవీలపై సంబంధిత వ్యాపార సంస్థలు 2శాతం చొప్పున సేవా రుసుం వసూలు చేస్తున్నాయి. బ్యాంకులు స్వైపింగ్ యం త్రాలు ఇచ్చినందుకు ప్రతి లావాదేవీపైనా ఇలా వసూలు చేస్తున్నాయని, ఈ విషయంలో తామేమీ చేయ లేమని వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు.
పన్ను ఎందుకు కట్టాలి
పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ ద్వారా లావాదేవీలు నిర్వహించినప్పుడు అదనంగా పన్ను వసూలు చేస్తున్నారు. స్వైపింగ్ విధానాన్ని ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. అమలు సక్రమంగా జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అదనపు పన్నులు మేమెందుకు చెల్లించాలి.
– ఇ.రాజేష్, వినియోగదారుడు, తణుకు
7సార్లు ఏటీఎం వాడితే రూ.200 పోయింది
జీతాన్ని డ్రా చేసుకునేందుకు ఈనెలలో 7సార్లు ఏటీఎం కార్డు ఉపయోగించాను. నేను డ్రా చేసిన దానికంటే అదనంగా రూ.200 పోయాయి. బ్యాంక్ అధికారులను అడిగితే సేవా రుసుంగా వసూలు చేశామని చెప్పారు.
– బట్టు అరవింద్‌కుమార్, జంగారెడ్డిగూడెం
నగదు రహిత లావాదేవీలపైనా మినహాయింపు లేదు
నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తే ఎటువంటి చార్జీలు ఉండవని చెప్పిన బ్యాంకులు ప్రస్తుతం సేవా రుసుం వసూలు చేస్తున్నాయి. నేను చేపల వ్యాపారం చేస్తుంటాను. స్వైపింగ్ మెషిన్ ద్వారా చేసే ప్రతి లావాదేవీపైనా బ్యాంకులు భారీగా పన్ను వసూలు చేస్తున్నాయి.
– చింతపూడి పెద్దిరాజు, ఏలూరు
Advertisement