టీటీకి పెరుగుతున్న ఆదరణ
టీటీకి పెరుగుతున్న ఆదరణ
Published Thu, Sep 1 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
మేయర్ రజనీ శేషసాయి రాష్ట్రస్థాయి ర్యాంకింగ్
టోర్నమెంట్ ప్రారంభం
మూడు రోజులు జరగనున్న పోటీలు
రాజమహేంద్రవరం సిటీ : టేబుల్ టెన్నిస్‌కు ఆదరణ పెరుగుతోందని మేయర్ పంతం రజనీ శేషసాయి అన్నారు. స్థానిక జేఎన్ రోడ్డులోని ఎస్‌వీ ఫంక్షన్ హాలులో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌ను గురువారం ఆమె ప్రారంభించారు. మొదటి ఆటను మేయర్, కార్పొరేటర్ చండీప్రియ ఆడి పోటీలకు శ్రీకారం చుట్టారు. ఏపీ టీటీ అసోసియేషన్ అధ్యక్షుడు వి.భాస్కరరామ్ ఆధ్వర్యాన రాజమహేంద్రవరం టేబుల్ టెన్నిస్ అసోషియేషన్ నిర్వహిస్తున్న ఈ పోటీలు మూడు రోజులపాటు జరగనున్నాయి. క్యాడెట్ బాలురు, బాలికలు; సబ్ జూనియర్ బాలురు, బాలికలు; జూనియర్ బాలురు, బాలికలు; యూత్ బాలురు, బాలికలు, మెన్ అండ్ వుమెన్ విభాగాల్లో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తారు. మొదటి రోజు క్వాలిఫయింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు టోర్నమెంట్ డైరెక్టర్ వీఆర్ ముక్కామల తెలిపారు. ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు తరలివచ్చారన్నారు. ఎనిమిది టేబుళ్లపై 600 మ్యాచ్‌లు నిర్వహిస్తామని, వీటికి 20 మంది రిఫరీలుగా వ్యవహరిస్తారని వివరించారు. చివరి రోజు 20 మ్యాచ్‌లు మాత్రమే ఉండేవిధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం టోర్నమెంట్‌లో బాలుర విభాగం నుంచి 80, మెన్స్ 65, యూత్ 85, జూనియర్స్ 85 దరఖాస్తులు అధికంగా వచ్చాయన్నారు. చీఫ్ రిఫరీగా ఎం.వేణుగోపాల్ వ్యవహరిస్తారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్, టోర్నమెంట్ నిర్వాహకులు జేవీవీ అప్పారెడ్డి, వీటీవీ సుబ్బారావు, ఫల్గుణ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement