హోరాహోరీగా టీటీ పోటీలు
హోరాహోరీగా టీటీ పోటీలు
Published Sat, Jul 8 2017 10:52 PM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM
ఫైనల్‌కు చేరిన ఛార్వీపల్గున్
నేటితో పోటీల ముగింపు
కంబాలచెరువు(రాజమహేంద్రవరంసిటీ) : ఏపీ స్టేట్ రెండో ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి. స్థానిక గోదావరి గట్టు వద్ద ఉన్న త్యాగరాయ దాసాసేవా సమితి హాల్లో నిర్వహించిన రెండో రోజు పోటీల్లో రాష్ట్రంలోని 39 మంది పురుషులు, 80 మంది బాలికలు తలబడ్డారు. వీరిలో కేడెట్ బాలికల విభాగంలో రాజమహేంద్రవరానికి చెందిన ఛార్వీపల్గున్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారంతో ఈ పోటీలు ముగియనున్నాయి. ఏపీ స్టేట్ ప్రథమ ర్యాంకింగ్ పోటీలు గత నెలలో విజయవాడలో నిర్వహించారు. త్వరలో గుంటూరు, విశాఖపట్నంలో కూడా పోటీలు నిర్వహించనున్నారు. అనంతపురంలో ఫైనల్స్ నిర్వహించి నేషనల్‌కు క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు.
క్రీడాకారులకు ఉచిత శిక్షణ
రాజమహేంద్రవరం నుంచి ఎందరో ఆటగాళ్లను తయారుచేసే అవకాశం ఉంది. దేశం తరఫున ఆడే సత్తాగల క్రీడాకారులు ఇక్కడ ఉన్నారు. ఒక్క టేబుల్ టెన్నిస్‌కే కాదు ఏ క్రీడాలోనూ శిక్షణ పొందేందుకు ఇక్కడ స్టేడియం లేదు. ఆటగాళ్లను తయారు చేయాలంటే అన్ని వనరులు ఉండాలి. నగరంలో టౌన్‌హాలు ఎదురుగా ఉన్న టీటీ అకాడమీలో 72 మందికి టేబుల్ టెన్నిస్‌లో శిక్షణ ఇస్తున్నాం. రాజమహేంద్రవరంలో సొంతంగా 15 టేబుళ్లతో స్టేడియం నిర్మించనున్నాం. అక్కడ ఉచితంగా టీటీ శిక్షణతో పాటు యోగా, జిమ్ వంటివి ఎన్నో అందుబాటులోకి తీసుకువస్తాం
–వి.భాస్కర్‌రామ్, ఏపీ టేబుల్ టెన్నిస్ రాష్ట్ర అధ్యక్షుడు
బాగా ఆడుతున్నారు
టేబుల్ టెన్నిస్‌లో క్రీడాకారులు మంచి ప్రతిభ కనపరుస్తున్నారు. వీరిలో ప్రతిభగల వారిని ప్రోత్సహించి శిక్షణ ఇచ్చి నేషనల్స్, ఒలింపిక్‌కు పంపేందుకు సిద్ధంగా ఉన్నాం. రాజమహేంద్రవరంలో జరుగుతున్న రెండో ర్యాంకింగ్ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు వచ్చారు. వారందరికీ తగు ఏర్పాట్లు చేసి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. మంచి టీటీ క్రీడాకారులను తయారుచేస్తాం.
- ఎస్.ఎం.సుల్తాన్, ఏపీ టీటీ రాష్ట్ర కార్యదర్శి
నా కుమార్తెను ప్రోత్సహిస్తున్నాం
నా కుమార్తె ఆశ్రిత సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో తలపడుతోంది. చిన్నప్పటి నుంచే టేబుల్ టెన్నిస్‌పై ఎంతో ఆసక్తి చూపుతోంది. దీంతో మేము ఆమెను ప్రోత్సహిస్తున్నాం. ఎక్కడ టోర్నీ జరిగినా అందులో పోటీ పడుతోంది. ఆమె జాతీయ స్థాయిలో పోటీల్లో రాణించాలని కోరుకుంటున్నాం. - టి.సునీల, టీటీ క్రీడాకారిణి తల్లి, వైజాగ్
ఒలింపిక్ పతకం సాధిస్తా
ఏలూరులో జరిగిన టోర్నమెంట్ కేడెట్‌లో గోల్డ్ మెడల్ సాధించా. చిన్నప్పటి నుంచి టీటీ అంటే చాలా ఇష్టం. మా నాన్న గారు మంచి టీటీ క్రీడాకారుడు. ఆయన స్ఫూర్తితో ఈ ఆటపై మక్కువ ఏర్పడింది. ఒలిపింక్ పతకం తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నా.
- ఛార్వీపల్గున్, టీటీ క్రీడాకారిణి, రాజమహేంద్రవరం
టీటీ అంటే ఎంతో ఇష్టం
టేబుల్ టెన్నిస్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఇప్పటికే చాలా టోర్నమెంట్లలో ఆడాను. పలు పతకాలు వచ్చాయి. వాటన్నింటికన్నా దేశానికి పేరు తెచ్చేలా ఒలింపిక్ పతకం సాధించాలనే ధృడ నిశ్చయంతో ఉన్నా. - శైలునూర్ బాషా, టీటీ క్రీడాకారిణి, విజయవాడ
15 గోల్డ్ మెడల్స్ సాధించా
ఇప్పటి వరకూ ఎన్నో టోర్నీల్లో పాల్గొన్నా. 12 నేషనల్స్ ఆడాను. రాష్ట్ర స్థాయిలో 15 ప్రథమ స్థానాలు సాధించి గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నా. జాతీయ స్థాయి పోటీలంటే చాలా ఇష్టం. మరింత ముందుకు వెళ్లాలని ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆగిపోయాను.
- డి.రాహుల్, టీటీ క్రీడాకారుడు, రాజమహేంద్రవరం
స్పోర్ట్ కోటాలో ఉద్యోగం
చిన్నప్పటి నుంచి టీటీ అంటే ఎంతో ఇష్టం. ఇçప్పటి వరకూ 300 పైగా టోర్నీలు ఆడాను. ఆటలపై నాకున్న మక్కువతోనే నాకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చింది. టేబుల్ టెన్నిస్‌లో ఇండియా తరఫున ఆడాలనే లక్ష్యంతో ఉన్నాను. - చల్లా ప్రణీత, టీటీ క్రీడాకారిణి, విజయవాడ
Advertisement
Advertisement