కాణిపాకం ఆలయంలో తలనీలాల చోరీ
కాణిపాకం: ఇప్పటివరకు విలువైన వస్తువులను దొంగలు చోరీ చేయడాన్ని చూసాం. కానీ... వినడానికి కొంచెం వింతగానే ఉన్నా తలనీలాలను సైతం దొంగలు వదలడం లేదు. చిత్తూరు జిల్లాలో సుప్రసిద్ధ కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో తలనీలాల చోరీ జరిగింది.
మహిళా భక్తులు స్వామి వారికి సమర్పించిన తలనీలాలను హుండీలో ఉంచగా చోరులు తస్కరించుకు పోయారు. మహిళా భక్తుల తలనీలాలను కల్యాణకట్ట వద్ద ఉన్న ఓ ప్రత్యేక హుండీలో వేస్తుంటారు. శుక్రవారం రాత్రి హుండీలో తలనీలాలను కొక్కెం సాయంతో ఆగంతకులు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. చోరీకి గురైన తలనీలాల విలువ రూ.5 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు అంటున్నారు.