సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ఉద్యోగాల భర్తీలో పైరవీలు జరుగుతున్నాయని, కొందరు దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) సీఎండీ డి.ప్రభాకర్ రావు స్పష్టంచేశారు. రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఏఈల ఎంపిక నిర్వహిస్తామన్నారు. జెన్‌కో నిబంధనలు, రిజర్వేషన్లకు లోబడి నియామకాలు ఉంటాయని చెప్పారు. సోమవారం విద్యుత్ సౌధలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు చేసే మోసపూరిత హామీలను నమ్మవద్దని అభ్యర్థులను హెచ్చరించారు. ఎవరైనా అభ్యర్థులు దళారుల సహాయంతో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నిస్తే 8332983914 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
రుజువులుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జెన్‌కోలో 856 ఏఈ పోస్టుల భర్తీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. దరఖాస్తుల స్వీకరణ బాధ్యతలను సుపరిపాలన కేంద్రం (సీఈజీ)కు, రాత పరీక్ష నిర్వహణను జేఎన్టీయూ-హైదరాబాద్‌కు అప్పగించామన్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం 1,09,907 మంది అభ్యర్థులు రాతపరీక్షకు అర్హులుగా తేలారన్నారు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని 75 కేంద్రాల్లో నిర్వహించిన రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసిందన్నారు. రామంతాపూర్‌లోని ఓ కేంద్రంలో వికలాంగుడైన ఓ అభ్యర్థి బ్లూటూత్ ద్వారా కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తే పట్టుకుని పోలీసులకు అప్పగించామన్నారు. ఆ అభ్యర్థిపై క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. ఈ ఒక్క ఘటన మినహా ఇతర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదన్నారు.
రాతపరీక్ష కీ విడుదల
ఈ నెల 14న జరిగిన జెన్‌కో ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాల కీని సోమవారం జేఎన్టీయూ హెచ్ విడుదల చేసింది. ఈ నెల 18లోపు అభ్యంతరాలు తెలపాలని జెన్‌కో యాజమాన్యం సూచించింది. convener.aert2015@gmail.comకు మెయిల్ చేయాలని కోరింది.
ఏఈల భర్తీలో ప్రతిభే గీటురాయి
Published Tue, Nov 17 2015 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 12:34 PM
Advertisement