
సాక్షి, హైదరాబాద్: కరెంటు సరఫరాకు తిత్లీ తుపాన్ దెబ్బ తగిలింది. తిత్లీ తుపాన్ సృష్టించిన బీభత్స ప్రభావం దేశ వ్యాప్తంగా, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాపై పడింది. తీవ్ర వేగంతో వీచిన ఈదురుగాలులతో దేశంలోని ఉత్తర–దక్షిణ ప్రాంతాల మధ్య విద్యుత్ కారిడార్ (విద్యుత్ సరఫరా లైన్లు) దెబ్బతింది. తాల్చేరు–కోలార్, అంగూల్–శ్రీకాకుళం లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనితో ఉత్తరాది నుంచి తెలంగాణకు రావాల్సిన 3,000 మెగావాట్ల విద్యుత్ అకస్మాత్తుగా నిలిచింది. సగటున రాష్ట్రంలో స్థిరంగా 10,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతోంది. తాజాగా పరిణామాలు ప్రభావం చూపే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, సరఫరా అంశాలపై కేసీఆర్ శనివారం ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో సమీక్షించారు.
ఉత్తర భారత్ నుంచి రావాల్సిన విద్యుత్ పూర్తిగా ఆగిపోయిందని, బహిరంగ మార్కెట్‌లో కొనుగోళ్లూ నిలిచిపోయాయని ప్రభాకర్‌రావు వివరించారు. ఈ పరిస్థితి ఎదుర్కొని రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడిన పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవాలని సీఎం ఆదేశించారు. దెబ్బతిన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణకు మరో రెండు, మూడు రోజుల సమయం పట్టే అవకాశముందని, ఆ మేరకు సరఫరాలో కొరత ఏర్పడవచ్చని ప్రభాకర్‌రావు తెలియజేశారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి తప్పా బయట నుంచి విద్యుత్ వచ్చే పరిస్థితి లేదని వివరించారు.
రాష్ట్రానికి 3 వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని వెల్లడించారు. వచ్చే 3 రోజులు దక్షిణ భారత దేశంలో విద్యుత్ సరఫరాలో సమస్యలు ఏర్పడే అవకాశముందన్నారు. తెలంగాణలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశముందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ రాకున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేసీఆర్‌కు ప్రభాకర్‌రావు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment