జలకళ ఉన్నా హై‘డల్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కృష్ణా పరీవాహకంలోని జలాశయాలన్నీ పూర్తిగా నిండటంతో రోజూ లక్షల క్యూసెక్కుల వరదను కిందకు విడుదల చేస్తున్నా పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు జలవిద్యుదుత్పత్తి చేసుకొనే అవకాశం లేకుండా పోయింది. ఎగువ జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు నిర్వహించకుండా ఏడాదిగా తాత్సారం చేయడంతో రోజుకు రూ. 4 కోట్ల విలువ చేసే 7.93 మిలియన్ యూనిట్ల జలవిద్యుదుత్పత్తికి గండిపడుతోంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే మరమ్మతులు నిర్వహించాల్సి ఉండగా సత్వర నిర్ణయాలు తీసుకోకుండా తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) గత, ప్రస్తుత సీఎండీలు, డైరెక్టర్లు తీవ్ర తాత్సారం చేయడం, సకాలంలో టెండర్లు నిర్వహించకపోవడంతో సంస్థకు భారీ ఆదాయనష్టం కలుగుతోంది. సుమారు రూ. 30 కోట్లు ఖర్చు చేస్తే నాలుగు జలవిద్యుత్ కేంద్రాలకూ మరమ్మతులు పూర్తయ్యేవని జెన్కో అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కృష్ణా బేసిన్‌లోని జలాశయాలకు కనీసం నెల రోజులు వరద కొనసాగినా ఈ ఏడాది రూ. 120 కోట్ల విలువ చేసే విద్యుత్‌ను జెన్కో నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. గరిష్టంగా మూడు నెలలు వరద కొనసాగితే రూ. 300 కోట్ల నుంచి రూ. 420 కోట్ల విలువ చేసే విద్యుత్‌ను నష్టపోనుంది. 330.8 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తికి గండి.. రాష్ట్రంలో మొత్తం 2,441.76 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంగల జలవిద్యుత్ కేంద్రాలుండగా మరమ్మతులకు నోచుకోక ఏడాదికిపైగా 330.8 మెగావాట్ల సామర్థ్యంగల జలవిద్యుత్ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ప్రధానంగా శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎగువ జూరాల, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో కనీసం ఒక్కో యూనిట్ పనిచేయడం లేదు. వర్షాలు, వరదలు మొదలవడంతో ఇప్పుడు టెండర్లు పిలిచినా ఇప్పట్లో మరమ్మతులు నిర్వహించే పరిస్థితి లేదు. వర్షాకాలం ముగిశాకే పనులు చేసేందుకు వీలు కలగనుంది. రాష్ట్రంలోని జలవిద్యుత్ కేంద్రాలు ఏటా కనీసం 3,000 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా వాటికి మరమ్మతులు జరగక లక్ష్యం నెరవేరట్లేదు. విద్యుత్ సంస్థలపై పర్యవేక్షణ లోపం రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శినే జెన్కో, ట్రాన్స్‌కోకు ఇన్చార్జి సీఎండీగా అదనపు బాధ్యతల్లో నియమించడంతో విద్యుత్ సంస్థలపై పూర్తి పర్యవేక్షణ లేకుండాపోయింది. ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ 15 రోజులపాటు సెలవులో వెళ్లడంతో ఆయన స్థానంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఆయన సచివాలయం నుంచే పనిచేస్తుండటంతో విద్యుత్‌సౌధలో రోజువారీ పాలనా వ్యవహారాల పర్యవేక్షణ గాడి తప్పిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరమ్మతులకు నోచుకోని జలవిద్యుత్ కేంద్రాల యూనిట్లు ఇవే.. – శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 900 (6150) మెగావాట్లు కాగా అందులో 150 మెగావాట్ల సామర్థ్యంగల 4వ యూనిట్ గతేడాది ఆగస్టు 17 నుంచి పనిచేయట్లేదు. స్టేటర్ వైండింగ్ కాలిపోవడంతోపాటు రోటర్ పోల్‌లో ఫాల్ట్ రాగా ఏడాదిగా మరమ్మతులు చేయలేదు. – నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 815.6 (1110 + 7100.8) మెగావాట్లు కాగా అందులో 100.8 మెగావాట్ల సామర్థ్యంగల రెండో యూనిట్‌కు సంబంధించిన రోటర్ స్పైడర్ ఆర్మ్‌కు పగుళ్లు వచ్చాయి. దీంతో గతేడాది నవంబర్ 10 నుంచి అది వినియోగంలో లేదు. జపాన్ నుంచి ఇంజనీర్లు వస్తేనే దానికి మరమ్మతులు జరుగుతాయని 9 నెలలుగా కాలయాపన చేస్తున్నారు. – ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 234 (639) మెగావాట్లు కాగా అందులో 39 మెగావాట్ల సామర్థ్యంగల మూడో యూనిట్లో స్టేటర్ వైండింగ్ కాలిపోవడంతో గతేడాది ఆగస్టు 7 నుంచి వినియోగంలో లేదు. – దిగువ జూరాల విద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 240 (640) మెగావాట్లు కాగా అందులోని అన్ని యూనిట్లలో సీల్ లీకవుతోంది. అన్ని యూనిట్లలో నిరంతర విద్యుదుత్పత్తి కొనసాగించే పరిస్థితి లేదు. – పులిచింతల జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 120 (430) మెగావాట్లు కాగా 2022 అక్టోబర్ 1 నుంచి 30 మెగావాట్ల సామర్థ్యంగల మూడో యూనిట్ నిరుపయోగంగా మారింది. దాదాపుగా రెండేళ్లు గడుస్తున్నా చెడిపోయిన రన్నర్ బ్లేడ్‌ను మార్చలేదు. – నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం 10 (25) మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉండగా మరమ్మతులు చేయకపోవడంతో 2022 నవంబర్ 9 నుంచి మొత్తం విద్యుత్ కేంద్రం నిరుపయోగంగా ఉంది. – పాలేరు మినీ హైడ్రో పవర్ స్టేషన్ సామర్థ్యం 2 (12) మెగావాట్లు కాగా మెగావాట్ల సామర్థ్యంగల ఒకటో యూనిట్ గత మార్చి 6 నుంచి నిరుపయోగంగా ఉంది. రన్నర్ హబ్‌కు మరమ్మతులు చేయాల్సి ఉంది.