రాజ్యాధికార సాధనే తారకంకు నివాళి
రాజ్యాధికార సాధనే తారకంకు నివాళి
Published Thu, Sep 29 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
తెనాలి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వీరాభిమాని అయిన బొజ్జా తారకం తన జీవితకాలమంతా పీడితజన హక్కుల కోసం పోరాటం చేశారని కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దుడ్డు ప్రభాకర్ చెప్పారు. ప్రముఖ న్యాయవాది, దళిత, పీడిత ప్రజల హక్కుల కోసం కషి చేసిన బొజ్జా తారకం సంస్మరణ సభ గురువారం సాయంత్రం ఇక్కడి కవిరాజ పార్కులోని వీజీకే భవన్‌లో నిర్వహించారు. టి.శ్యాంషా అధ్యక్షత వహించారు. మానవహక్కుల వేదిక, మహాత్మాఫూలే, అంబేడ్కర్ విజ్ఞానసమితి, తెనాలి సంయుక్తంగా ఏర్పాటుచేసిన సభలో ప్రభాకర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, పీడిత కులాల ప్రజల హక్కుల కోసం బయట సమాజంలో, న్యాయస్థానంలో పోరాడిన యోధుడు తారకం అన్నారు. దళిత మహాసభ వ్యవస్థాపకుల్లో ఒకరుగా దళితమహాసభ అధ్యక్షుడిగా దళితుల పక్షాన రాజీలేని పోరాటం చేసినట్టు గుర్తుచేశారు. సాంకేతిక విద్యాశాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ బత్తుల పున్నయ్య మాట్లాడుతూ దళిత బహుజనులు ఏకమై అంబేడ్కర్ ఆయుధంగా రాజ్యాధికారానికి రావాలనీ, అదే తారకంకు ఇచ్చే నివాళిగా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్, డివిజనల్ అధ్యక్షుడు దేవరపల్లి వీరయ్య తన ప్రసంగంలో చుండూరు కేసు న్యాయపోరాటంలో తారకం చేసిన కషిని వివరించారు. మానవ హక్కుల వేదిక జిల్లా కో–కన్వీనర్ అమర్తలూరి రత్నప్రసాద్, గురివిందపల్లి వేమయ్య, జీఎస్ నాగేశ్వరరావు ప్రసంగించారు.
Advertisement