నిరుద్యోగులకు ఎర !
నిరుద్యోగులకు ఎర !
Published Wed, Jul 20 2016 8:28 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
కాంట్రాక్టు ఉదో్యగాలు ఇప్పిస్తామంటూ వసూళ్ల పర్వం
చక్రం తిప్పుతున్న వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు
డబ్బులు సమర్పించుకుంటున్న నిరుద్యోగులు
మచిలీపట్నం :
వైద్య, ఆరోగ్య శాఖలోని కొందరు ఉద్యోగులకు అవినీతి జబ్బు చేసింది. కాంట్రాక్టు ప్రాతిపాదికన ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపాదికన 28 ఏఎన్‌ఎం, వైద్యులు, ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 16వ తేదీతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది. సుమారు 2వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతోంది. ఈ నెల 23వ తేదీన ఎంపికైనవారి తుది జాబితాను ఆన్‌లైన్‌లో పెడతారు. ఈ క్రమంలో డీఎం అండ్ హెచ్‌వో కార్యాలయంలో పని చేసే ఇద్దరు ఉద్యోగి, విజయవాడలో మరో అధికారి ఈ పోస్టులు తాము ఇప్పిస్తామని నిరుద్యోగుల్లో ఆశలు కల్పిస్తున్నారు. తొలుత ఏడాదిపాటు పని చేసేందుకు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారని, ఆ తర్వాత రెన్యూవల్ లేదా పర్మినెంట్ చేసే అవకాశం ఉంటుందని నమ్మబలుకుతున్నారు. కేవలం రూ.10 వేల నుంచి రూ.15వేలు ఇస్తే చాలు.. ఉద్యోగం ఇప్పిస్తామని చెబుతున్నారు. దీంతో నిరుద్యోగులు ఆశతో డబ్బులు ఇస్తున్నట్లు సమాచారం.
ప్రత్యేక జాబితా తయారు !
తుది ఎంపికకు సమయం దగ్గర పడుతుండటంతో అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులు తమదైన శైలిలో దరఖాస్తుదారులకు ఎర వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దరఖాస్తులో అభ్యర్థుల అర్హతలు, వచ్చిన మార్కుల వివరాలను పరిశీలించి... ‘మీకే ఉద్యోగం ఇప్పిస్తాం. మెరిట్ జాబితాలో మీ పేరు ఉంటుంది..’ అని నిరుద్యోగులను కలిసి ఆశలు కల్పిస్తున్నట్లు సమాచారం.
డబ్బులు వసూలు చేస్తున్న ఉద్యోగులు ప్రత్యేకంగా ఒక జాబితాను తయారు చేసినట్లు తెలిసింది. కలెక్టర్ పర్యవేక్షణలోనే పోస్టుల భర్తీ ఉంటుందని పైకి ప్రచారం చేస్తూనే... జాబితాలు తామే కదా తయారు చేసేది.. అని బెదిరింపులకు కూడా దిగుతున్నట్లు సమాచారం. దీంతో పోతే రూ.15వేలే కదా.. అని ఎక్కువ మంది డబ్బులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పారదర్శకంగానే పోస్టుల భర్తీ
వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టులను పారదర్శకంగానే భర్తీ చేస్తున్నాం. ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తాం. ఎంపికైనవారి జాబితాను ఈ నెల 23వ తేదీన ఆన్‌లైన్‌లో ఉంచుతాం. ఈ వ్యవహారం మొత్తం కలెక్టర్ పర్యవేక్షణలోనే జరుగుతుంది. అభ్యర్థులు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు.’
– డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి, డీఎం అండ్ హెచ్‌వో
Advertisement