బెల్ పనుల్లో ‘కృష్ణ’ మాయ
విజయవాడ : మచిలీపట్నంలోని ‘బెల్’ కంపెనీ విస్తరణ ప్రాజెక్టును పామర్రు మండలం నిమ్మలూరులో 53 ఎకరాల్లో చేపట్టారు. నిర్మాణ పనులకు సంబంధించి తొలుత భూమిని మెరక (ఎత్తు పెంపు) చేయాల్సి ఉంది. రూ.ఏడు కోట్ల విలువైన ఈ మెరక పనుల కోసం ఆసక్తి ఉన్న కంపెనీలు ముందుకు రావాలని ఈ ఏడాది జనవరి మూడో వారంలో బెల్ టెండర్లు ఆహ్వానించగా పలు కంపెనీలు దాఖలు చేసుకున్నాయి. వాటిలో ఏడు కంపెనీలు అర్హత సాధించాయి. ఇక్కడే గూడుపుఠాణీకి తెరతీశారు.
టెండర్ దాఖలు చేసిన కంపెనీలను తప్పించారు..
మెరకతోలడం కేవలం రూ.1.5 కోట్ల పని అని ఆ కంపెనీలకు ఈ–మెయిల్ పంపారు. దాంతో తక్కువ విలువ పనిగా భావించి ఐదు కంపెనీలు పక్కకు తప్పుకున్నాయి. అయితే టెండర్లు ఖరారు కావడానికి ముందురోజు మళ్లీ బెల్ కంపెనీ వారికి మెయిల్ పంపి మొదట అనుకున్నట్లు రూ.7 కోట్ల పనేనని సమాచారం ఇచ్చింది. దీంతో వారు బెల్ అధికారులను సంప్రదించడంతో ఈ మట్టిని పోలవరం కాలువ నుంచి తవ్వి తీసుకురావాలని, అది మంత్రి దేవినేని ఉమ మనిషైతేనే సాధ్యమని వారికి తెలిపారు. వేరే వారికి కాంట్రాక్టు దక్కినా పని చేయలేరని స్పష్టం చేశారు.
మంత్రి అండదండలతోపాటు సీఎం సతీమణి, కుమారుడు లోకేష్, సినీనటుడు బాలకృష్ణకు స్థానిక ప్రజాప్రతినిధి బాగా కావాల్సిన వారని, ఆయన చెప్పిన సూర్య కన్‌స్ట్రక్షన్స్, పవర్‌మెక్ కంపెనీలకు చెందిన వారైతేనే ఈ పని చేయగలరని చెప్పారని తెలుస్తోంది. చివరి నిమిషంలో బెల్ రూటు మార్చడం, మంత్రి, సీఎం కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించడంతో ఆ కంపెనీలు మిన్నకుండిపోయాయి. చివరకు రేసులో సూర్య, పవర్‌మెక్ కంపెనీలు ఉండగా, సూర్య సంస్థకు కాంట్రాక్టు దక్కింది.
ఆ తర్వాత స్థానిక టీడీపీ మండల స్థాయి ప్రజాప్రతినిధి భర్త సూర్య కంపెనీ నుంచి సబ్‌కాంట్రాక్టు తీసుకుని ఆ పని చేపట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. బెల్ కార్యాలయంలోని కొందరు ఉద్యోగులతో కుమ్మక్కయి ఈ తతంగం నడిపి ఏడు కోట్ల కాంట్రాక్టును చేజిక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే తాను సీఎం భార్య భువనేశ్వరికి ఎంత చెబితే అంతని, ఆమె దత్తత తీసుకున్న కొమరవోలులో పనులన్నీ తానే చేయిస్తున్నానని, లోకేష్, బాలకృష్ణ వచ్చినప్పుడల్లా తనకు బోలెడు ఖర్చవుతోందని, అందుకే ఈ కాంట్రాక్టు తనకు ఇప్పించారని దబాయిస్తున్నట్లు సమాచారం.