పత్తాలేని పథకం | tdp government colaps maa inti mahalaxmi scheam | Sakshi
Sakshi News home page

పత్తాలేని పథకం

Published Thu, Jul 7 2016 4:15 AM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

పత్తాలేని పథకం

పత్తాలేని పథకం

‘మా ఇంటి మహాలక్ష్మి’ ఎక్కడున్నావమ్మా..?
బంగారుతల్లి పథకం పేరు మార్పుతో సరిపెట్టిన టీడీపీ ప్రభుత్వం
ఇంత వరకు విధివిధానాలు ఖరారు చేయని వైనం
దరఖాస్తులు స్వీకరించే నాథుడు లేడు..
ఆడపిల్లలకు చేకూరని లబ్ధి
పథకాన్ని నీరుగార్చొద్దంటున్న తల్లిదండ్రులు

కారంచేడు : ఆడ శిశువులను పురిట్లోనే చిదిమేస్తున్న దారుణ ఘటనలను నివారించేందుకు.. బాలికల జీవితానికి భరోసా కల్పిందుకు ఉద్దేశించిన ప్రభుత్వ పథకం జాడ కనిపించడం లేదు. బాలికల వివాహ సమయం వరకు వివిధ దశలుగా తల్లిదండ్రులకు ఆర్థిక చేయూతనివ్వడం ఈ పథక ం ఉద్దేశం. 2013లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించిన బంగారుతల్లి పథకం టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అమలుకు నోచుకోలేదు. 2014లో పథకం పేరును ‘మా ఇంటి మహాలక్ష్మి’  అని మార్చిన చంద్రబాబు సర్కారు కనీసం ఇప్పటి వరకు విధివిధానాలు ప్రకటించలేదు. ఆడపిల్లల లబ్ధి కోసం అర్జీలు స్వీకరించే నాధుడు లేరు. కనీసం ఈ పథకం ఏశాఖ పర్యవేక్షణలో అమలవుతుందో కూడా తెలియని అయోమయ స్థితి ఉందంటే బాలికల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ఇట్టే అర్ధమవుతుంది.

ఆందోళనలో తల్లిదండ్రులు..
ఈ పథకం మొదటి రెండు కాన్పులలో జన్మించిన ఆడపిల్లలకు వర్తిస్తుంది. బాలికలు డిగ్రీ పూర్తి చేసే వరకు అంటే 21 ఏళ్లు నిండే వరకు మొత్తం తొమ్మిది విడతలుగా రూ. 2.16 లక్షలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధ చేసింది. గత రెండేళ్లుగా ఈ పథకం అమలుకు నోచుకోవడం లేదు. కనీసం అర్జీలు ఏ శాఖ అధికారులకు అందజేయూలో కూడా తెలియడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలను చదివించేందుకు ఎలాంటి ఆర్థిక సమస్యలు తలెత్తకుండా వుండేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం నీరుగారిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఐసీడీఎస్‌కు బదిలీ చేశారు..
బంగారుతల్లి పథకం పేరును మా ఇంటి మహాలక్ష్మిగా మార్చారు. 2014 నుంచి ఈ పథకం ఐసీడీఎస్‌కు బదిలీ చేశారు. అర్జీలు కూడా అంగన్‌వాడీల ద్వారా సేకరిస్తారని మాకు చెప్పారు. అప్పటి నుంచి మేం అర్జీలు స్వీకరించడం లేదు.
- తేళ్ళ మోహనరావు,ఏపీఎం, కారంచేడు

 జీవో రాలేదు..
మా ఇంటి మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ఆర్జీలు ఐసీడీఎస్ కార్యాలయంలో ఇవ్వమని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దానికి సంబంధించిన సాప్ట్‌వేర్ గానీ, జీవో కానీ మాకు పంపలేదు. అందుకే మేం అర్జీలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందితే స్వీకరిస్తాం. - సీడీపీవో విజయగౌరి, పర్చూరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement