ప్రత్తిపాడు ‘దేశం’లో వర్గపోరు
-
‘వరుపుల’కు భంగపాటు
-
ఎమ్మెల్యేపై మహిళల తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
‘కొత్తనీరు వస్తే పాతనీరు పోవాల’న్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీలో పరిస్థితి. టీడీపీ ఆవిర్భావం నుంచీ పార్టీ జెండా భుజాన మోస్తున్న వారిని పక్కనపెట్టేసి కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో జిల్లా టీడీపీలోని పలు నియోజకవర్గాల్లో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. అనపర్తి, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ఈ వ్యవహారం ముదిరి పాకనపడుతోంది. ఈ మూడింటిలో ప్రధానంగా ప్రత్తిపాడులో ఎమ్మెలే వరుపుల సుబ్బారావుకు పాతకాపులు షాక్‌లమీద షాక్‌లు ఇస్తున్నారు. ఎమ్మెల్యే సుబ్బారావు ఒంటెద్దుపోకడలతో పార్టీలో మొదటి నుంచీ ఉన్న వారిని విస్మరిస్తున్నారని నియోజకవర్గంలో పార్టీ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఇందుకు జన చైతన్య యాత్రలు వేదికలవుతున్నాయి. ఇటీవల రాచపల్లిలో వరుపులకు టీడీపీ నేతల నుంచే భంగపాటు ఎదురువగా, తాజాగా రౌతులపూడి మండల కేంద్రంగా వరుపులకు సొంత పార్టీలోని దివంగత పర్వత చిట్టిబాబు వర్గం నుంచి ఎదురుదెబ్బ తగిలింది. మండల టీడీపీ అ««దl్యక్షుడు అంకంరెడ్డి సతీష్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం రౌతులపూడిలో పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ప్రత్తిపాడు సమన్వయకర్త పర్వత రాజుబాబు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.టీడీపీలోకి వచ్చిన సందర్భంలో ఇరువర్గాలకూ సమాన ప్రాధాన్యత కల్పిస్తామన్న మాటలు అమలు కావడం లేదని రాజబాబు వర్గీయులు ఎమ్మెల్యే వరుపులపై విరుచుకుపడ్డారు. మూడు దశాబ్థాలుగా పార్టీలో పనిచేస్తున్న తమకు అన్యాయం చేసి కొత్తగా పార్టీలో చేరిన వర్గానికి సంక్షేమ పథకాలను కట్టబెడతారా అంటూ చిట్టిబాబు వర్గానికి చెందిన శంఖవరం సొసైటీ అధ్యక్షుడు యామన సురేష్ ఎమ్మెల్యే వరుపులను సమావేశంలోనే గట్టిగా నిలదీశారు. ఇటీవల గ్రామంలో రెండు అంగనవాడీ భవనాలు మంజూరుకాగా వాటిని ఇరువర్గాల వారికని చెప్పి మీరు చేసిన పనేమిటని ఆయన ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. రెండు భవనాలనూ పార్టీలో కొత్తగా చేరిన వారికి కేటాయించడమేమిటని ఆయన నిలదీశారు. గ్రామంలో ఇటీవల గృహనిర్మాణ పథకంలో 10 ఇళ్లు మంజూరవ్గా, రెండు వర్గాలకు ఐదేసి వంతున కేటాయిస్తామని ఇప్పుడు తమకు నచ్చిన వర్గానికే కట్టబెట్టడం ఏమిటని సురేష్ మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే మీ వెంట తిరగలేమని తేల్చిచెప్పి ఎంపీటీసీ సభ్యుడు వాసం సాంబశివరావుతో కలసి సురేష్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.పార్టీ సమన్వయ కర్త రాజుబాబు, వరుపుల తమ్మయ్యబాబు సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
సమావేశ బహిష్కరణ...
సమావేశం నుంచి వారు వెళ్లిపోవడంతో గొడవ సద్ధుమనిగిందని వరుపుల సహా నేతలు ఊపిరిపీల్చుకున్నారు. అంతలోనే ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లా¯ŒS నిధుల్లో జీవనోపాది పొందడానికి ఇరువర్గాలకు చెందిన ఆరుగురికి రుణాలు కోసం ప్రతిపాదనలు రూపొందించి కేవలం ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారికే ఎలా కేటాయించారని బలరామపురం గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు దడాల నాగమణి, ముడదా సత్యవతి, పెనుపోతుల రాణి, కళ్లెం చినబుల్లి, రామలక్ష్మి తదితర మహిళలు ఎమ్మెల్యే వరుపులతో వాగ్వావాదానికి దిగారు. కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటేట ఇపుడు మీరంతా కొత్తగా చేరినవారికి ప్రాధాన్యత కల్పించి తమను విస్మరిస్తారా అని విరుచుకుపడ్డారు. అర్హులైన వారికి రుణాలు అందిస్తామని ఎమ్మెల్యే నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే అనుచరుడు సోమరౌతు చంద్రమౌళి కల్పించుకుని ‘గతంలో మీ వర్గానికి చెందిన ఏడుగురికి రుణాలిచ్చామని, ఇప్పుడు తమ వర్గానికి ఇచ్చుకుంటామని ఏం చేసుకొంటారో చేసుకోండంటూ’ అక్కడ నుంచి ఎమ్మెల్యేను తీసుకెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరుకు ఆగ్రహించిన మహిళలు తమ సామాజిక వర్గానికి చెందిన రుణాల విషయంలో మీకు సంబంధమేమిటని మౌళిని నిలదీశారు. టీడీపీ సమన్వయకర్త పర్వత రాజుబాబు కారును మహిళలు అడ్డగించారు.