అట్ల.. ఎట్టెట్టా..! | TDP land kabza in kurnool | Sakshi
Sakshi News home page

అట్ల.. ఎట్టెట్టా..!

Published Tue, Jun 13 2017 12:50 AM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM

అట్ల.. ఎట్టెట్టా..! - Sakshi

అట్ల.. ఎట్టెట్టా..!

► టీడీపీ నాయకుడి అక్రమాలు
► ఈర్లదిన్నెలో భూముల కబ్జా
► ఇతరుల భూములకు తన పేరు చూపి రుణం
► బ్యాంకులను మోసం చేసిన కృష్ణారెడ్డి
►   సింగిల్‌ విండో డైరెక్టర్‌ కావడంతో అక్రమాలను పట్టించుకోని అధికారులు!


టీడీపీ అధికారంలోకి వచ్చేనాటికి అతనికి ఉన్నది మూడెకరాల పొలం..
నేడు అతనికి ఉన్న పొలం 13.64 ఎకరాలు..
ఇది కష్టార్జితం కాదు.. రికార్డులు మాయ చేసి సంపాదించింది..
కబ్జాలు చేసి కూడబెట్టుకుంది..
ఇందుకు సాక్షాలుగా.. వెబ్‌ల్యాండ్‌లో ఒక విస్తీర్ణం..
పాసుపుస్తకంలో మరో విస్తీర్ణం.. కనిపిస్తోంది!
మరొకరి భూమిని తనదిగా చూపించి ఇతను బ్యాంకులనే బురిడీ కొట్టించాడు!!
సి.బెళగల్‌ మండలంలో టీడీపీ నాయకుడి అక్రమాల బాగోతమిదీ!!!


కోడుమూరు : టీడీపీ నాయకుల భూదందాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్లను లొంగదీసుకొని ఇష్టానుసారంగా వెబ్‌ల్యాండ్‌లో పేర్లు మార్చుకుంటున్న బాగోతం సి.బెళగల్‌ మండలంలో వెలుగులోకొచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడుతుండడంతో పట్టా భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. సి.బెళగల్‌ మండలం కొత్తకోట మజారా గ్రామమైన ఈర్లదిన్నెలో టీడీపీ నాయకుడు కృష్ణారెడ్డి ఇతరుల భూములను తన పేరుతో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకొని గూడూరు కేడీసీసీ బ్యాంకులో రూ.19.64లక్షలు రుణం తీసుకోవడం అక్రమాలకు పరాకాష్ట.

భూమిని ఎలా మార్చారంటే...
అట్ల రాధాకృష్ణారెడ్డికి.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేనాటికి కేవలం మూడెకరాలు మాత్రమే వ్యవసాయ భూమి ఉంది. వీఆర్వోలు, రెవెన్యూ అధికారుల అండదండలతో 13.64 ఎకరాల భూమి ఉన్నట్లు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకొని రూ.19.64లక్షల రుణం తీసుకున్నారు. కృష్ణారెడ్డికి ఖాతా నెంబర్‌ 941లో 13.37ఎకరాల భూమి ఉన్నట్లు వీఆర్వో అక్బర్‌సాహెబ్‌ పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చారు. 

ఆ ఖాతా నెంబర్‌లో ఉన్న సర్వేనెంబర్లు ప్రభుత్వ భూములు కావడంతో రిజిష్టర్‌ ఆఫీస్‌ మార్టిగేజ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే కృష్ణారెడ్డి.. సింగిల్‌ విండో డైరెక్టర్‌ కావడంతో అదే ఖాతా నెంబర్‌లో ఇతరుల భూమిని తన పేరు మీద నమోదు చేయించుకొని.. కేడీసీసీ బ్యాంకులో రుణం తీసుకున్నారు. ప్రస్తుతం కృష్ణారెడ్డి వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా 10.29ఎకరాలు ఉంది. పట్టాదారు పాసుపుస్తకంలో ఉన్న వివరాలకు, వెబ్‌ల్యాండ్‌లో ఉన్న వివరాలు పరిశీలిస్తే ఎన్నో తేడాలు కన్పిస్తున్నాయి.

నిజానిజాలు ఇవీ..
♦ అట్ల కృష్ణారెడ్డికి 312/1ఎ, 312/1ఈ సర్వే నెంబర్లలో రెండెకరాల భూమి ఉంది. కొండాపురంలో సర్వే నెంబర్‌ 427లో ఒక ఎకరా భూమి కలదు.
♦  కొండాపురం గ్రామంలో సర్వే నెంబర్‌ 322/2లో వెంకటలక్ష్మమ్మకు 1.77సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని కృష్ణారెడ్డి తన పేరు మీద వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకున్నారు.
♦  కొత్తకోటలోని 387సర్వే నెంబర్‌లో భూమి విస్తీర్ణమే లేదు. రుణం తీసుకునే సమయంలో 1.44సెంట్ల భూమి ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపించారు.
♦ 386 సర్వేనెంబర్‌లో పూర్తి విస్తీర్ణం 56సెంట్లు. ఇందులో కృష్ణారెడ్డి 36సెంట్లు, కె.రంగనాథరావు అనే రైతుకు 20సెంట్ల భూమి ఉంది. అయితే మొత్తం 56సెంట్లు తనదేనని కృష్ణారెడ్డి ఆన్‌లైన్‌లో చూపించారు.
♦ ఈర్లదిన్నె గ్రామంలోని 352, 353, 354 సర్వే నెంబర్లలో పూర్తి విస్తీర్ణం 20.55ఎకరాల భూమిలో 13.68ఎకరాల భూమిని కృష్ణారెడ్డి సోదరుడు (డాక్యుమెంట్‌ నెంః 2007/2014, 2008/2014) కొనుగోలు చేశారు. మిగిలిన భూమి 6.87ఎకరాలను కృష్ణారెడ్డి తనకు వంశపారపర్యంగా వచ్చినట్లు ఆన్‌లైన్‌లో చూపించుకున్నారు.  తనకున్న 3ఎకరాలు తీసేస్తే 10.67సెంట్ల భూమి ఇతరులది తన పేరు మీద నమోదు చేయించుకొని గూడూరు కేడీసీసీ బ్యాంకులో రుణం తీసుకున్నారు.. వెబ్‌ల్యాండ్‌లో రైతుల పేర్లను రాత్రికి రాత్రే మార్చివేసి రుణాలు పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement