
టీడీపీ నేత బాదన్న హత్య
కొడవళ్లు, కత్తులతో దాడి చేసిన ప్రత్యర్థులు
పోలీసుల అదుపులో నిందితులు...?
పాత కక్షలు భగ్గుమన్నాయి. సూర్యోదయం వేళ విచ్చు కత్తులు పైకి లేచాయి. నెత్తురు రుచి మరిగిన వేటకొడవండ్లు సైతం గాలిని చీల్చుకుంటూ శరీర భాగాలను బలంగా తాకాయి. తప్పించుకునేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రత్యర్థులు చుట్టుముట్టి విచ్ఛణారహితంగా మారణాయుధాలతో దాడి చేయడంతో వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్, టీడీపీ సీనియర్ నేత బాదన్న హతమయ్యారు. ఘటనతో కళ్యాణదుర్గం ప్రాంతం ఉలిక్కిపడింది.
కళ్యాణదుర్గం: నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత బాదన్న(65)ను గోళ్ల శివారులో ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. రోజువారి దినచర్యలో భాగంగా గురువారం తెల్లవారుజామున కళ్యాణదుర్గం రోడ్డులో వాకింగ్‌కు బయలుదేరిన అతను గ్రామ శివారులోని దురగమ్మ చెలిమి వద్దకు చేరుకోగానే మాటు వేసిన ప్రత్యర్థులు చుట్టుముట్టారు. కొడవళ్లతో తల, భుజంపై నరికారు. వీపుపై కత్తులతో పొడిచారు. బాదన్న కుప్పకూలి పోయాడు. అదే సమయంలో అటుగా బస్సు వస్తుండడంతో గమనించిన ప్రత్యర్థులు వెంటనే పారిపోయారు. విషయాన్ని బస్సులో వారు గ్రామస్తులకు తెలపడంతో హుటాహుటిన స్థానికులు అక్కడకు చేరుకున్నారు.
వెంటనే అతన్ని కళ్యాణదుర్గం ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సలు అందేలోపు అతను మరణించాడు. పోస్టుమార్టం అనంతరం బాదన్న మృతదేహాన్ని గోళ్లకు చేర్చారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ టి.ఎస్. వెంకటరమణ, సీఐలు చలపతి, శివప్రసాద్ పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ ఉన్నతాధికారులతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని పదుల సంఖ్యలో ఎస్‌ఐలు, వందలాది మంది కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ పోలీసులు, వజ్ర సిబ్బందితో గోళ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఘటనకు సంబంధించి నలుగురు అనుమానితులను మల్లాపురం గ్రామ రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనుమానితుల్లో గోళ్లకు చెందిన ఒకరు, కర్ణాటకలోని ఓబుళాపురం, తిప్పారెడ్డిపల్లికి చెందిన ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది.
భూతగాదాలే కారణమా?
భూతగాదాలే బాదన్న హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. గోళ్ల గ్రామానికి చెందిన వ్యక్తికి కుటుంబసభ్యులతో భూ తగాదాలు ఉన్నాయి. ఈ విషయంపై బాదన్న పంచాయితీ నిర్వహించి, న్యాయ పరిష్కారం చూపినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇదే విషయంపై తనకు న్యాయం చేయాలంటూ సదరు వ్యక్తి మంత్రి కాలవ శ్రీనివాసులును ఇటీవల కలిసి విన్నవించుకోగా, బాదన్న వద్దకెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో బాదన్నపై కక్ష పెంచుకున్న అతను కర్ణాటకలోని తన బంధువులతో కలిసి హత్యకు పథకం వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, బాదన్న హత్యను ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఆయన కుమారుడు మారుతీ చౌదరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ రామాంజినేయులు పలువురు టీడీపీ నేతలు ఖండించారు.