షాపు కట్టి... మద్యం చిచ్చుపెట్టి !
♦ మద్యం మంటలను రాజేస్తున్న టీడీపీ నేతలు
♦ సిద్దార్థ మహిళా కళాశాల పక్కనే మద్యం దుకాణం
♦ మహిళలు, విద్యార్థినుల నిరసన
♦ అధికారులు తొలగించినా రాత్రికి రాత్రే నిర్మాణం
♦ ఎమ్మెల్యే గద్దె, కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ వత్తాసు
♦ దుకాణం ఎదుట మహిళలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ ధర్నా
♦ ప్రసాదంపాడులో కొనసాగుతున్న ఆందోళనలు
జిల్లాలోని టీడీపీ నాయకులు మద్యం మంటలను రాజేస్తున్నారు. విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలకు అతి సమీపంలోనే ఓ ఎమ్మెల్యే అనుచరుడు మద్యం షాపు ఏర్పాటు చేస్తున్నారు. కళాశాల విద్యార్థినులు, స్థానిక మహిళలు ఆందోళనల కారణంగా నాలుగు రోజుల కిందట అధికారులు ఆ షాపును కూల్చివేశారు. అయితే, ఎమ్మెల్యే అండతో రాత్రికి రాత్రే దుకాణం నిర్మించేశారు. ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో స్థానిక మహిళలతో కలిసి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ గురువారం ఆ దుకాణం ఎదుట ధర్నా చేశారు. మరోవైపు ప్రసాదంపాడులోనూ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
సాక్షి, అమరావతిబ్యూరో:
మద్యం ఆదాయం కోసం ప్రభుత్వం కోర్టు నిబంధనలనే కాలరాస్తే .. టీడీపీ నేతలు తమ్ముళ్ల ఆదాయం కోసం మద్యం మంటలను మరింతగా రాజేస్తున్నారు. ఇళ్లు, గుడి, బడి ఉన్నా లెక్కచేయని తెలుగు తమ్ముళ్లు మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. స్థానికులు, మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా యజమానులు వారి ఆవేదనను పరిగణలోకి తీసుకొకుండా దుకాణాలు ఏర్పాటు చేçస్తున్నారు. కళాశాల పక్కనే మద్యం దుకాణం అన్యాయంటూ కాలనీ వాసులు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ను ఆశ్రయిస్తే మీ ఆవేదన కంటే మద్యం ఆదాయమే ప్రభుత్వానికి అవసరం కదా..? అంటూ వారిని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు.
నాలుగువేల మంది విద్యార్థులున్నా..
విజయవాడ ఫకీర్‌గూడెం కాలనీలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. సిద్ధార్థ మహిళా కళాశాల ఉంది. అందులో నాలుగు వేల మంది విద్యార్థినిలు చదువుతున్నారు. వారిలో ఏడు వందల మంది హాస్టల్‌లో ఉంటున్నారు. ట్రాఫిక్ సమస్య కారణంగా కాలేజ్ వెనుకవైపు గేటు ఏర్పాటు చేస్తున్నారు. ఆ గేట్ ముందు వైపే కొత్తగా మద్యం దుకాణం టీడీపీ నేత ఏర్పాటు చేస్తున్నాడు. చుట్టూ నివాసాలు, కాలేజ్ పక్కనే మద్యం షాపు ఏర్పాటుచేస్తే మందుబాబుల ఆగడాలతో విద్యార్థినులు అసౌకర్యానికి గురవుతారని, చుట్టూ నివాసాల వారు ప్రశాంతత కోల్పోతారని స్థానికులు, ఆ కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాన్ని అడ్డుకోవాలంటూ స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ సుజాతకు ఫిర్యాదు చేశారు.
ఆమె పరిశీలించి మద్యం దుకాణాన్ని తొలగించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కార్పొరేషన్ అధికారులు పరిశీలించి కార్పొరేటర్ సమక్షంలోనే అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఆ వైన్ యజమాని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రధాన అనుచరుడు కావడంతో దుకాణం అక్కడే ఉంచాలని పట్టుబడ్డాడు. మరో టీడీపీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ ఆ వైన్ యజమానికి మద్దతు ఇవ్వడంతో దుకాణం తొలగించిన చోటే రాత్రికి రాత్రే మరొకటి నిర్మించాడు. రెండు రోజుల్లో షాపు ప్రారంభిస్తానని స్థానికులకు సవాల్ విసరడంతో గురువారం ఆకాలనీ మహిళలతోపాటు కాలేజ్ ప్రిన్సిపాల్ ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ సుజాత ఆందోళన చేశారు. దుకాణ నిర్మాణం అడ్డుకోవాలంటూ ఆ కాలనీ వాసులతోపాటు కాలేజ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి రాతపూర్వకంగా ఎక్సైజ్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి మహిళా కాలేజ్ పక్కనే మద్యం దుకాణం ఏర్పాటు తప్పుగా తేల్చారు.
ప్రభుత్వ ఆదాయం పొగొట్టుకోవాలా..?
మహిళా కళాశాల, నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటును అడ్డుకోమని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను స్థానిక మహిళలు వేడుకున్నారు. మహిళల ఆవేదనను అర్థం చేసుకోకుండా ఎమ్మెల్యే ప్రభుత్వ ఆదాయం పోగొట్టుకోవాలంటూ వారినే ప్రశ్నించినట్లు స్థానికులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే దుకాణాలు నివాసాల మధ్య ఏర్పాటు చేసుకుంటున్నారని నేనేమీ చేయలేనంటూ ఎమ్మెల్యే చేతులెత్తేయడంపై వారు మండిపడుతున్నారు. మరో టీడీపీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ మద్యం దుకాణం ఎక్సైజ్ పాలసీ ప్రకారం జరుగుతుందని నేనేమీ చేయలేయని మాట దాట వేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రసాదంపాడులో..
ప్రసాదంపాడు దళిత కాలనీలో బార్ అండ్ రెస్టారెండ్ ఏర్పాటు విషయంపై ఆరు రోజులుగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. వీరికి ప్రజాసంఘాలు, మహిళా సంఘాలుతోడు కావడంతో ఆందోళన ఉధృతం అయింది. వైన్ యజమాని టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో మహిళల ఆందోళన లెక్కలోకి తీసుకోవటం లేదు. బార్ పక్కనే గుడి, బడులు ఉన్నాయని ప్రశాంతత కోల్పోతామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. గురువారం వైఎస్సార్సీసీపీ జిలా పార్టీ అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, నియోజక సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు స్థానికుల ఆందోళనకు మద్దతిచ్చారు.