అర్థరాత్రి టీడీపీ నేతల దౌర్జన్యం
తిరుపతి క్రైం: మద్యం దుకాణానికి, పర్మిట్ రూం ఏర్పాటుకు అనుమతి ఎందుకిచ్చారంటూ తెలుగుదేశం నాయకులు దౌర్జన్యానికి దిగారు. పోలీసు, ఎక్సైజ్ అధికారులు కూడా ఏమీ చేయలేక మిన్నకుండి పోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. నగరంలో లక్ష్మీపురం ప్రాంతంలో ఉన్న దేవి వైన్స్‌పై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నర్సింహయాదవ్‌తోపాటు ఆయన అనుచరులు గురువారం రాత్రి దాడి చేశారు.
ఈ ప్రాంతంలో మద్యం దుకాణం, పర్మిట్ రూంకు ఎలా, ఎవరు అనుమతి ఇచ్చారంటూ ఆ దుకాణంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కుర్చీలను తీసుకెళ్లి తూర్పుపోలీస్ స్టేషన్‌కు ఎదురుగా రోడ్డుపై పడేశారు. పక్కనే ఉన్న వంతెనపై వాహనాల రాకపోకలకు అడ్డంకులు సృష్టించారు. ఇంత చేస్తున్నా అక్కడికి చేరుకున్న సివిల్, ఎక్సైజ్ సీఐలు మౌనంగా ఉన్నారు. వారిని ఏమీ చేయలేక సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. హల్‌చల్ చేస్తున్న వారికి మద్దతుగా ఎమ్మెల్సీ శ్రీనివాసులు అక్కడికి చేరుకున్నారు. ఈ దందా అర్థరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది.