వక్ఫ్ స్థలంలో టీడీపీ నేతల బార్ అండ్ రెస్టారెంట్
వక్ఫ్ స్థలంలో టీడీపీ నేతల బార్ అండ్ రెస్టారెంట్
Published Wed, Jul 19 2017 12:30 AM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM
- వద్దే వద్దంటూ మహిళలు, విద్యార్థుల రాస్తారోకో
నంద్యాల రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబు అనాలోచిత నిర్ణయం వల్ల అవస్థల పాలవుతున్నామని, ఇళ్ల మధ్య బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటును తక్షణమే నిలుపుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కర్నూలు జిల్లా నంద్యాల మండలం రైతునగరం గ్రామ పంచాయతీ వాసులు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం రైతునగరం పంచాయతీ పరిధిలోని వీరన్న కాలనీ, ఎస్‌ఆర్‌నగర్ కాలనీల మహిళలు, నాగార్జున జూనియర్ కళాశాల విద్యార్థులు స్థానిక నంద్యాల–కోవెలకుంట్ల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నూనెపల్లె రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 231లో ఉన్న వక్ఫ్‌బోర్డు స్థలంలో మంత్రి అఖిలప్రియ సమీప బంధువుల భాగస్వామ్యంతో చందమామ బార్‌అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసేందుకు మంగళవారం పనులు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న వీరన్న కాలనీ, ఎస్‌ఆర్‌నగర్ కాలనీల మహిళలు, నాగార్జున జూనియర్ కళాశాల విద్యార్థులతో పాటు న్యాయవాది వివేకానందరెడ్డి, స్థానికులు పార్థసారథిరెడ్డి, నాగేంద్రారెడ్డి, జయరామిరెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు. ప్రహరీ నిర్మాణానికి పునాదులు తవ్వుతుండగా మహిళలు అడ్డుకొని.. మేస్త్రీలను, కూలీలను వెనక్కి పంపారు. అనంతరం అక్కడే ఉన్న రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మంత్రి అఖిలప్రియ తక్షణమే జోక్యం చేసుకుని బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటును నిలిపివేయించాలని డిమాండ్ చేశారు.
మహిళలు ఆందోళన చేస్తున్న సందర్భంలోనే కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి కాలనీలోని మోహన్‌రెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేశారు. రోడ్డుకు పదిఅడుగుల దూరంగా ఏర్పాటు చేస్తామని, మహిళలతో ఆందోళన విరమింపజేయాలని సూచించారు. ఈ సమాచారాన్ని ఆయన తెలపడంతో మహిళలు మరింత ఆగ్రహానికి గురయ్యారు. చంద్రబాబు డౌన్.. డౌన్, ఇళ్ల మధ్య బార్ అండ్ రెస్టారెంట్ వద్దే వద్దంటూ నినాదాలు చేశారు. దీంతో నంద్యాల రూరల్ ఎస్‌ఐ తిమ్మారెడ్డి, ఎక్సైజ్ ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలతో చర్చించారు. నిబంధనలకు విరుద్ధంగా బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే నిలుపుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో స్థల యజమానిగా చెప్పుకుంటూ అక్కడికి వచ్చిన లక్ష్మిరెడ్డిని మహిళలు చుట్టుముట్టారు. ‘బార్ అండ్ రెస్టారెంట్ మా ఇళ్ల ముందు కాదు.. మీ ఇంటి ముందు ఏర్పాటు చేసుకోండి’ అంటూ హితవు చెప్పారు. పోలీసులు జోక్యం చేసుకొని మహిళలను శాంతింపజేశారు.
Advertisement
Advertisement