మట్కా రాయుళ్లకు నేతల అండ! | TDP Leaders Support Matka Beeters | Sakshi
Sakshi News home page

మట్కా రాయుళ్లకు నేతల అండ!

Published Sun, Nov 6 2016 10:43 PM | Last Updated on Tue, Oct 16 2018 2:30 PM

మట్కా రాయుళ్లకు నేతల అండ! - Sakshi

మట్కా రాయుళ్లకు నేతల అండ!

మట్కారాయుళ్లకు అధికార పార్టీ నేతలు అండదండలు అందిస్తున్నారు. దీంతో వారు యథేచ్ఛగా తమ ఆట కొసాగిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తుండగా... తప్పించేందుకు నేతలు యత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

- పోలీసుల చేతిలో నిర్వాహకుల జాబితా
- కొందరిని కాపాడేందుకు అధికార పార్టీ నాయకుల ప్రయత్నాలు

ప్రొద్దుటూరు క్రైం: మట్కారాయుళ్లకు అధికార పార్టీ నేతలు అండదండలు అందిస్తున్నారు. దీంతో వారు యథేచ్ఛగా తమ ఆట కొసాగిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తుండగా... తప్పించేందుకు నేతలు యత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మట్కాతోపాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా ఎస్పీ ఉక్కు పాదం మోపుతున్నారు. రెండు నెలలు గడువు ఇచ్చిన ఎస్పీ తర్వాత కూడా మార్పు రాకుంటే రంగంలోకి దిగుతానని హెచ్చరికలు జారీ చేశారు. చాలా చోట్ల పోలీసు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. మట్కా రాయుళ్లపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపించారు. మట్కాపై పోలీసుల దాడులు ముమ్మరం కావడంతో చాలా ప్రాంతాల్లోన పేరు మోసిన బీటర్లు ఊళ్లు వదలి కూడా వెళ్లారు. కొందరైతే అజ్ఞాతంలోకి వెళ్లి తమ కార్యకలాపాలకు స్వస్తి చెప్పారు. కొంత కాలం పాటు విరామం ప్రకటిస్తే మేలనే భావనతో మరి కొందరు ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ విధంగా సుమారు 50 శాతం దాకా మట్కా ఆగిపోయింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొందరు ధైర్యంగా మట్కా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
బీటర్లను అదుపులోకి తీసుకోండి
జిల్లాలో మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తూ పోలీసులకు తప్పించుకొని తిరుగుతున్న వారి జాబితాను జిల్లా పోలీసు అధికారులు స్పెషల్‌ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా ఇప్పటికే తెప్పించుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా నుంచి ఆయా పోలీస్‌స్టేషన్‌లకు మట్కా, క్రికెట్‌ బుకీల పేర్ల జాబితా వచ్చినట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరుకు పలువురి మట్కా రాయుళ్ల జాబితాను జిల్లా అధికారులు పంపినట్లు తెలిసింది. పట్టణంలోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 23 మంది మట్కా నిర్వాహకులు ఉన్నట్లు  పోలీసులు గుర్తించారు. వీరంతా ఇప్పటి వరకూ పోలీసు రికార్డుల్లో లేనివారే. వారిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో సుమారు 12 మంది వన్‌టౌన్‌ పరిధిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రామేశ్వరం ప్రాంతానికి చెందిన వ్యక్తి పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం మట్కా కోసమే ఇటీవల పార్టీ మారిన పెన్నానగర్‌కు చెందిన మరో వ్యక్తి కూడా జాబితాలో ఉన్నారు. వీరితో పాటు ఆర్ట్స్‌ కాలేజీ రోడ్డు, మిట్టమడివీధిలో ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు కొన్ని రోజుల నుంచి తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే వీరిలో రామేశ్వరం ప్రాంతానికి చెందిన మట్కా బీటర్‌ను కాపాడేందుకు అధికార పార్టీ నాయకుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిపై నుంచి పోలీసుల దృష్టి మళ్లించేందుకు ఆ నేత మరో 20 మంది పేర్లు రాసి, వీరు కూడా మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారని.. వీరిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులకు లెటర్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఆరుగురు మట్కా బీటర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసుల గాలింపు ఎక్కువగా ఉంది. దీంతో ఎలాగైనా బయట పడేందుకు ఓ ద్వితీయశ్రేణి నాయకుడి సహకారంతో పార్టీ ప్రధాన నాయకుడి ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. వీరు స్టేషన్‌ అధికారులపై కూడా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టూ టౌన్, త్రీ టౌన్‌ పరిధిలో ఉన్న మట్కా రాయుళ్ల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మూడు రోజుల క్రితం పట్టణానికి చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి గంజాయితో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసు జాబితాల్లో ఉన్న బీటర్లు ఎలాగైనా బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.



 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement