తెగబడ్డ తెలుగు తమ్ముళ్లు | Abounded Telugu brothers | Sakshi
Sakshi News home page

తెగబడ్డ తెలుగు తమ్ముళ్లు

Published Tue, Jun 24 2014 3:47 AM | Last Updated on Wed, Apr 3 2019 8:54 PM

పులివెందులలో అప్పుడే అధికార పార్టీ నేతల ఆగడాలు మొదలయ్యాయి.

- ప్రయివేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లు ఇవ్వాలని అల్టిమేటం
- మట్కా బీటర్లనూ వదలని టీడీపీ చోటా నేతలు
- పులివెందులలో అధికారులపై రాజకీయ పెత్తనం
- చంద్రబాబుకు ఫిర్యాదు చేసే యోచనలో టీడీపీ కీలక నేతలు

 కడప: పులివెందులలో అప్పుడే అధికార పార్టీ నేతల ఆగడాలు మొదలయ్యాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటంతో పాటు మట్కా బీటర్లను, జూద నిర్వాహకులను మామూళ్లకోసం బెదిరిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
 ఆది నుంచి పులివెందుల ప్రజలు వైఎస్ కుటుంబానికే పట్టం కడుతూ వస్తున్నారు.

వైఎస్ కుటుంబంపై ఉన్న ప్రజాభిమానాన్ని  ఓర్వలేక కొంతమంది టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారు. 2009లో వైఎస్ మరణానంతరం పులివెందులపై అప్పటి ప్రభుత్వం శీతకన్ను వేసి నిధులు విడుదల చేయలేదు. ఆ తర్వాత ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోలీసుల ద్వారా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అణచివేసే చర్యలకు ఉపక్రమించారు. పులివెందుల నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలతోపాటు మున్సిపల్, స్థానిక ఎన్నికలలో వైస్సార్ కాంగ్రెస్‌పార్టీ భారీ ఆధిక్యత ముందు కనీసం టీడీపీ పరువు కూడా దక్కించుకోలేకపోయింది.

సార్వత్రిక ఎన్నికల్లో ూడా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డిలకు పులివెందుల ప్రజలు 80వేల పైచిలుకు మెజార్టీ అందించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా పలువురు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది.
 
మట్కా బీటర్లనూ వదలని టీడీపీ చోటా నేతలు :
 ‘నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు’ అన్న చందంగా పలువురు తెలుగుత మ్ముళ్లు ఎక్కడ పడితే అక్కడ ఆదాయమే పరమావధిగా తెగబడుతున్నారు. నీకు మట్కా.. నాకు గ్యాంబ్లింగ్ అంటూ పలువురు చోటా నేతలు పంపకాలకు తెర తీస్తున్నారు. పులివెందులలో మట్కా, జూదం, మొబైల్ గ్యాంబ్లింగ్‌లు నిర్వహిస్తున్న వారిని టీడీపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారు.

ఏకంగా అధికారం వచ్చిన వారం రోజుల్లోపే పట్టణంలో మట్కా రాస్తున్న వారి వద్దకు వెళ్లి నెలనెలా మామూళ్లు ఇవ్వాలని బెదిరించిన పర్వం వెలుగులోకి వచ్చింది. పైగా మట్కా రాస్తుండగా వచ్చిన సొమ్మునంతా కూడా బీటరు నుంచి కొంతమంది చోటా,మోటాలు లాక్కెళ్లినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. దీంతో బెంబేలెత్తిన కొంతమంది కంపెనీ మట్కా బీటర్లు  ఏకంగా కొద్దిరోజులపాటు పులివెందుల విడిచి వెళ్లారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది.

పోలీసులకు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. కొంతమంది పోలీసులు ఏకంగా మామూళ్లు తీసుకొని మట్కా ఆడిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.  టీడీపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరుతోపాటు పోలీసులు పట్టించుకోని వైనంపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని టీడీపీలో కొంతమంది కీలక నేతలు సిద్ధమయ్యారు. రెండు మూడు రోజుల్లో హైదరాబాద్‌లో సీఎంను కలిసి పులివెందులలో జరుగుతున్న మొత్తం పరిస్థితులను చంద్రబాబుకు వివరించనున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఇప్పటికే జిల్లా ఎస్పీకి కూడా టీడీపీలోని కొంతమంది నేతలు మట్కా వ్యవహారంపై
ఫిర్యాదు చేసినట్లు భోగట్టా.

ప్రయివేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లు ఇవ్వాలని అల్టిమేటం :
 పులివెందులలోని ప్రయివేట్ పాఠశాల యాజమాన్యాలకు కూడా ఉచిత సీట్లు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి పేరుతో అల్టిమేటం ఇచ్చారు. దాదాపు 60నుంచి 70సీట్లు కావాలని కోరినట్లు తెలిసింది. టీడీపీ ఆఫీసు నుంచి పంపించే లిస్ట్‌లోని విద్యార్థులను చేర్చుకోవాలని కోరగా.. ప్రయివేట్ యాజమాన్యాలు అన్ని సీట్లు ఇవ్వలేమని చేతులెత్తేసినట్లు తెలియవచ్చింది.  
 
అధికారులపై రాజకీయ పెత్తనం :
 అధికారం ఉంది కదా అని టీడీపీ నాయకులు అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ పోస్టు మాకే కావాలని కొందరు.. ఉన్న పోస్టులను రద్దు చేయండని మరికొందరు చేస్తున్న రాజకీయ ఒత్తిడులతో అధికారులు బెంబేలెత్తుతున్నారు. పులివెందుల ప్రాంతంలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలతోపాటు మున్సిపల్, ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు ఇలా ఎప్పుడు ఒత్తిళ్లకు గురి చేయలేదని.. ప్రతి దానికి టీడీపీ చోటా నేతలు వచ్చి కార్యాలయాల్లో బెదిరించడం తగదని పలువురు అధికారులు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మూకుమ్మడిగా సెలవులో వెళ్లడానికి కూడా సిద్ధమని పలువురు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement