
టీడీపీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్
వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రైతుల గుండెల్లో సిలికా గునపం దించడానికి సిద్ధమయ్యారు.
నెల్లూరు : వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రైతుల గుండెల్లో సిలికా గునపం దించడానికి సిద్ధమయ్యారు. సిలికా ఖనిజానికి మంచి ధర రావడంతో ఆగమేఘాల మీద అందిన కాడికి తోడేసి సొమ్ము చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రైతులు, సిలికా గనుల యజమానులకు జరిగిన ఒప్పందాలను తుంగలో తొక్కి యంత్రాలతో ఖనిజం బయటకు తీస్తున్నారు. ఈ వ్యవహారా న్ని అడ్డుకోవడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన రైతుల మీదే కేసులు నమోదు చేయించారు. చిల్లకూరు మండలం వేళ్లపాలెం వద్ద గురువారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఎమ్మెల్యే రామకృష్ణ అద్దేపల్లి, వేళ్లపాలెం గ్రామాల్లో రెండు సిలికా గనులు కొనుగోలు చేశారు. అద్దేపల్లి నుంచి బల్లవోలు గ్రామం వరకు ఉన్న సొనకాలువ ఈ సిలికా గనుల సమీపం నుంచి వెళుతుంది. ఈ కాలువ కింద 400 ఎకరాల భూమి సాగవుతోంది. సిలికా గనుల యజమానులు యంత్రాలు పెట్టి ఖనిజాన్ని బయటకు తీస్తే సొనకాలువ దెబ్బ తింటుందని గతంలో రైతులు ఆందోళన చేశారు. దీంతో ఇక్కడ యంత్రాలతో కాకుండా మనుషులతో మాత్రమే సిలికా బయటకు తీసేలా గనుల యజమానులు, రైతుల మధ్య ఒప్పందం జరిగింది. దీంతో గనుల యజమానులు సొనకాలువలకు ఎలాంటి ముప్పు లేకుండా తవ్వకాలు చేసుకుంటున్నారు. కొంత కాలంగా సిలికాకు భారీ డిమాండ్ రావడంతో ఎమ్మెల్యే రామకృష్ణ అద్దేపల్లి వద్ద ఉన్న మైను నుంచి యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు.
దీంతో ఇటీవల ఆ గ్రామస్థులు తవ్వకాలను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు వారిని రాత్రి పూట పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి తవ్వకాలు అడ్డుకుంటే కేసులు పెడతామని బెదిరించి పంపారు. దీంతో అక్కడ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి సిలికాను తరలిస్తున్నారు. వేళ్ళపాళెం గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబరు 256పి లో ఉన్న 40 ఎకరాల సిలికా గనిలో గురువారం సాయంత్రం యంత్రాలను పెట్టి తవ్వకాలు చేపట్టేందకు సిద్ధం అయ్యారు. దీంతో రైతులు ఇటీవల బాగు చేసుకున్న సొనకాలువలు ఎక్కడ దెబ్బతిని పంటకు నీరు చేరకుండా పోతుందోనని తవ్వకాలను అడ్డుకున్నారు.
వీరిలో 12 మంది టీడీపీకి చెందిన రైతులు, ఇతరులు ఒకరున్నారు. గని మేనేజర్ వెంటనే ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యే గూడూరు డీఎస్పీ శ్రీనివాసులుతో మా ట్లాడారు. సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై అంకమ్మ రాత్రి 10 గంటల సమయంలో ఆ గ్రామానికి చేరుకుని కిరణ్‌రెడ్డి, శ్రీనివాసులు, రమేష్ అనే రైతులను అరెస్టు చేసి చిల్లకూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలస మయంలో ఈ ముగ్గురితో పాటు మరో 10 మంది రైతుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.