అధికారం మాదే.. చంపి పాతేస్తాం
♦ సీఎం మావాడే.. క్వారీ వదిలిపెట్టి వెళ్లండి
♦ వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేకు చెందిన క్వారీ సిబ్బందిపై ‘తమ్ముళ్ల’ దౌర్జన్యం
♦ రాయి లోడుతో వెళ్తున్న లారీల అడ్డగింపు
రాయదుర్గం: ‘‘ముఖ్యమంత్రి మావాడే. అధికారం మాదే. క్వారీల్లో అంతా మావర్గం వారే ఉన్నారు. మధ్యలో మీరెందుకు? క్వారీ ఖాళీ చేస్తారా? లేకపోతే ఒక్కొక్కరిని చంపి ఇక్కడే పాతిపెట్టమంటారా? పాతి పెట్టినా అడిగేవాడు లేడు. అధికారులు కూడా ఏమీ చేయలేరు’’ అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన క్వారీ యజమానులు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి చెందిన క్వారీ సిబ్బందిని బెదిరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్లు వద్ద 18 క్వారీలున్నాయి. ఇందులో ఒకటి కాపు రామచంద్రారెడ్డికి చెందినది. ఆయన 24 హెక్టార్లలో లీజు పొందారు. దానికి ఒక వైపు సతీష్ క్వారీ, రెండో వైపు టీవీఎస్ కాంతారావుకు చెందిన క్వారీ ఉన్నాయి.
రామచంద్రారెడ్డి క్రమం తప్పకుండా రాయల్టీలు చెల్లిస్తున్నారు. ప్రతి ట్రిప్పర్‌లోనూ వే బిల్లులతో నాణ్యమైన రాయిని సరఫరా చేస్తున్నారు. క్రషర్ యజమానులు ఈ క్వారీ నుంచే ఎక్కువగా రాళ్లను తీసుకెళ్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని మిగిలిన క్వారీల యజమానులు కూడబలుక్కొని రామచంద్రారెడ్డి క్వారీని నిలిపివేయించాలని కుట్రపన్నారు. శనివారం రాత్రి రాయి లోడు కోసం జిందాల్ కంపెనీకి చెందిన నాలుగు లారీలు క్వారీలోకి వెళ్లాయి. అవి తిరిగి వస్తున్నప్పుడు అడ్డగించారు. సతీష్ క్వారీ వైపు హిటాచీని, కాంతారావు క్వారీలో లారీలను అడ్డంగా పెట్టారు. ఆదివారం ఉదయం విలేకరులు వెళ్లి ఫొటోలు తీయడంతో కాంతారావు క్వారీలోని లారీలను తొలగించారు. సతీష్ క్వారీలో మాత్రం హిటాచీని తొలగించలేదు.
క్వారీ యజమానులపై కేసు: మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి క్వారీ నుంచి రాళ్లతో వెళ్తున్న లారీలను అడ్డగించిన పొరుగు క్వారీల యజమానులపై కేసు నమోదు చేసినట్లు బొమ్మనహాళ్ ఎస్సై శ్రీరాం శ్రీనివాస్ తెలిపారు. రామచంద్రారెడ్డి క్వారీ మేనేజర్ తిమ్మనగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సతీష్, కాంతారావులపై కేసు నమోదు చేశామన్నారు.
దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి
‘‘టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. వైఎస్సార్‌సీపీ నాయకులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నేను న్యాయంగా వ్యాపారం చేస్తున్నా బెదిరించడం శోచనీయం. వారిని చట్టపరంగా ఎదుర్కొంటాం. దౌర్జన్యం చేసేవారికి ప్రజలే గుణపాఠం చెబుతారు’’
- కాపు రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం