హామీలు మరిచిన సీఎంకు బుద్ధి చెబుదాం
ఎస్సీ వర్గీకరణకు హామీ విస్మరించిన సీఎం చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు మాదిగలు సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు
- సింహా గర్జన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
కర్నూలు సీక్యాంప్: ఎస్సీ వర్గీకరణకు హామీ విస్మరించిన సీఎం చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు మాదిగలు సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారపేటలోని సమితి కార్యాలయంలో ఆదివారం సింహగర్జన మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా వర్గీకరణ అంశం ఊసెత్తడం లేదన్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల సమయంలో మాదిగలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఉషామెహ్రా కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ నెల 29న కర్నూలులో నిర్వహించే సింహా గర్జనకు సంబంధించిన మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాత్రిసుబ్బయ్యమాదిగ, రాష్ట్ర కార్యదర్శి దాదాపోగునవీన్, ఎమ్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ భానుప్రకాష్, జిల్లా అధ్యక్షుడు అరిగిలి రవి, కర్నూలు సిటీ అధ్యక్షుడు రాచపోగుల రవి తదితరులు పాల్గొన్నారు.