- విద్యార్థినితో అసభ్య ప్రవర్తన
- పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
- పోలీసుల అదుపులో ఉపాధ్యాయుడు?
సిద్దిపేట రూరల్: విద్యార్థిని అవసరాన్ని ఆసరా చేసుకున్న ఓ ఉపాధ్యాయుడు వేకిలి వేషాలు వేసి కటకటాలపాలయ్యాడు. గురువు వృత్తికే మచ్చతెచ్చిన సదరు కీచక చీటర్ గుట్టు బుధవారం రట్టు అయ్యింది. ఈ సంఘటన సిద్దిపేటలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఒన్‌టౌన్ పోలీసుల కథనం మేరకు... పట్టణంలోని రాంనగర్‌కు చెందిన యువతి(17) ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
కాగా, ఆమె పదో తరగతి స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదివింది. ఆ సమయంలో అదే స్కూల్లో పనిచేస్తున్న గణితం ఉపాధ్యాయుడు రాంచంద్రం.. విద్యార్థిని లెక్కల్లో వచ్చిన సందేహాలను ఇంటికి రప్పించుకొని నివృతి చేసేవాడు. ఈక్రమంలో బాలికను మభ్యపెట్టి పలుమార్లు లోబరుచుకున్నాడు.
పదో తరగతి టీసీ విషయంలోనూ ఇంటికి వెళ్లిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న బాధిత యువతి పాఠ్యంశానికి సంబంధించిన అనుమానాలను నివృతి చేసుకోవడానికి మరోసారి సదరు ప్రబుద్ధుడి దగ్గరకు వెళ్లింది. పాత పరిచయంతో ఉపాధ్యాయుడు తిరిగి యువతితో అనుచితంగా వ్యవహరించాడు. దీంతో విసిగిపోయిన బాధిత యువతి.. తల్లిదండ్రులతో కలిసి మంగళవారం రాత్రి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు రాంచంద్రం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.