
'గొడవ చేయాలని ముందే వ్యూహం పన్నారు'
హైదరాబాద్: సభలో గొడవ చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అంచెలంచెలుగా గొడవ చేయాలనివారు ముందే వ్యూహం పన్ని సభ కొనసాగకుండా కుట్ర చేశారని ఆరోపించారు. చేతనైతే గ్రామాల్లో తిరిగి ఏ రైతు ఆత్మహత్య చేసుకోవద్దని భరోసా కల్పించాలి తప్ప ఇలా రైతుల సమస్యల కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం ప్రత్యారోపణలతో ఆందోళనకు దిగితే రైతులే ప్రతిపక్షాలపై తిరగబడతారని చెప్పారు. అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని చెప్పారు.
ఇలాంటి రోజులు చూసేందుకు కొత్త రాష్ట్రం ఏర్పడలేదని, రైతులకు ప్రభుత్వం పూర్తి భరోసాగా ఉంటుందని ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని అన్నారు. ప్రధాన అంశం తెలంగాణ రైతుల ఆత్మహత్యలు, కరువు అని భావించి వెంటనే రెండు రోజులపాటు ఆ అంశాలపై చర్చ జరిపి అన్ని పార్టీల నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేశామని తెలిపారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా తామేమన్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నామా అని ప్రశ్నించారు.
రైతుల ఆత్మహత్యల నివారణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పడింది రైతుల ఆత్మహత్యలు చూసేందుకు కాదని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. రుణమాఫీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టడం సరికాదని, రైతుల ఆత్మహత్యలు రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.